English   

రూలర్ ట్రైలర్.. విశ్వరూపం చూపించిన బాలయ్య..

ruler
2019-12-08 09:59:07

బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయాడు. జై సింహా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన కేయస్ రవికుమార్‌తో కలిసి ఈయన మరోసారి వస్తున్నాడు. రూలర్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రంపై ఉన్న అంతోఇంతో కాస్త తక్కువ అంచనాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రైలర్ తో అన్ని అనుమానాలకు తెరపడింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్ తో వచ్చాడు నందమూరి హీరో. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కేయస్ రవికుమార్. ముఖ్యంగా ఆయన గెటప్‌కు ఫ్యాన్స్ నుంచి కిరాక్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు టీజర్‌లో కూడా ఈ గెటప్ హైలైట్ అయింది. మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు ఈ సీనియర్ హీరో. రూలర్ ట్రైలర్ అంతా బాలయ్య ప్రధానంగానే సాగింది. ఆయనపైనే ఫోకస్ చేసాడు దర్శకుడు. మనం బాలయ్యను బాగా చూసుకుంటే చాలు.. ఆయనే ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను చూసుకుంటాడులే అనే ధైర్యం కేయస్ రవికుమార్‌లో కనిపిస్తుంది.

 

అందుకే కాబోలు బాలయ్యపైనే ట్రైలర్ అంతా కట్ చేసాడు రవికుమార్. ఈ చిత్రం ట్రైలర్చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఒంటిమీక ఖాకీ డ్రస్ ఉన్నపుడే బోన్‌లో పెట్టిన సింహాన్ని.. ఒక్కసారి అది తీసేస్తే బయటికి వచ్చిన సింహాన్ని.. ఇక వేటే అని టీజర్ లో చెప్పిన బాలయ్య ఇప్పుడు ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు.. వేటాడి వెంటాడి చంపుద్ది అంటూ రెచ్చిపోయాడు. రైతుల నేపథ్యంలో రూలర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కేయస్ రవికుమార్. ట్రైలర్ అంతా అదే ఎక్కువగా హైలైట్ చేసాడు. ఎమోషన్స్ తో పాటు మాస్ యాక్షన్ డ్రామా కూడా ఉండటంతో ఫ్యాన్స్ కు పిచ్చెక్కడం ఖాయం. కచ్చితంగా మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి సిద్ధమైపోతున్నాడు బాలయ్య. ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఈయన ఆశలన్నీ రూలర్ సినిమాపైనే ఉన్నాయి. తక్కువ టైమ్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు కేయస్ రవికుమార్. మరోసారి జై సింహా కాంబినేషన్‌లోనే సినిమా వస్తుంది. సోనాల్ చౌహాన్, వేదిక ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు. ప్రతిరోజూ పండగే సినిమాతో పాటు రవితేజ డిస్కో రాజాతో బాలయ్య పోటీ పడబోతున్నాడు.

More Related Stories