మెగాస్టార్ చిరంజీవి మరో దాసరి అవుతున్నారా..

ఏమో ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈ అనుమానం రావడం కామనే. ఎందుకంటే మొన్న జరిగిన ఇండస్ట్రీ పెద్దల మీటింగ్ లో అధ్యక్షుడు చిరంజీవే. ఇంకా చెప్పాలంటే ఈ మీటింగ్ ఏర్పాటు చేసిందే మెగాస్టార్. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల గురించి కూలంకశంగా మాట్లాడటానికే చిరు ఇది ఏర్పాటు చేసాడు. ఒకప్పుడు దాసరి ఇలా చేసేవారు. దాసరి అనే పేరులోనే పెద్దరికం ఉంది. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ముందుగా అంతా తట్టేతలుపు దాసరి నారాయణరావు. అర్ధరాత్రి వెళ్లి సమస్య చెప్పినా.. దాన్ని పరిష్కరించే వరకు దాసరి తపించేవారు. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఆయన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. దాసరి తర్వాత సురేష్ బాబు ఆ స్థానం కోసం పోటీ పడ్డారనే ప్రచారం జరిగినా.. ఆయన వైపు ఇండస్ట్రీ పెద్దలు పెద్దగా మొగ్గు చూపలేదు. దాంతో సురేష్ బాబు మధ్యలోనే ఆగిపోయారు. అల్లు అరవింద్ ఉన్నా తన విషయాలను మాత్రమే పట్టించుకుంటున్నారు.
దాంతో దాసరి వదిలివెళ్లిన పెద్దమనిషి కుర్చీ అలాగే ఉండిపోయింది. ఇండస్ట్రీలో తర్వాతి దాసరిగా మారిపోతున్నాడు చిరంజీవి. అవును.. ఇది నమ్మడానికి కాస్త కొత్తగా అనిపిస్తున్నా ఇదే నిజం. చిరుని ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా భావిస్తున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మెగాస్టార్ ఇంటి తలుపు తడుతున్నారు. అలాగే చాలా మంది చిరంజీవితో మునపటి వైరం మరిచిపోయి మరీ ఆయనతో కలుపుగోలుగా ఉంటున్నారు. రాజశేఖర్ దంపతులే దీనికి నిదర్శనం. అంతేకాదు.. చిరంజీవి ఇకపై సినిమాలకే పూర్తి సమయం కేటాయించబోతున్నారు. అంటే ముందులా ఆయనకు ఇప్పుడు రాజకీయాలు కూడా లేవు. దాంతో అందరి సమస్యలు తీర్చే పెద్దదిక్కుగా మారడానికి కావాల్సినంత టైమ్ కూడా ఉంది. అయితే దాసరి ప్లేస్ లోకి చిరు వస్తారని భావిస్తున్నా.. చిన్న సినిమాలకు ఆయనిచ్చే భరోసా ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ మధ్య ప్రతీ సినిమా వేడుకలో కూడా చిరు కనిపిస్తున్నాడు. చిన్న సినిమాలకు కూడా ఆయన బాసటగా నిలుస్తున్నారు.
ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. థియేటర్స్ కూడా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు చిన్న నిర్మాతలు. వాళ్లకు ఎప్పుడూ తన వంతు సాయం చేస్తుండేవారు దాసరి నారాయణరావు. అసలు ఇండస్ట్రీలో ఈ రోజు చిన్న సినిమాలకు కొద్దో గొప్పో మంచి రోజులు ఉన్నాయంటే దానికి కారణం దాసరి అని చెప్పక తప్పదు. ఇండస్ట్రీలో ఎక్కడ మంచి సినిమా వచ్చినా.. చిన్న సినిమాలకు అన్యాయం జరిగిందని తెలిసినా వెంటనే అక్కడికి వెళ్లి తన గళం విప్పేవారు దాసరి. చిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవాడు ఈయన. ఇప్పుడు పెద్ద హీరోలుగా చలామణి అవుతున్న వాళ్లంతా ఒకప్పుడు చిన్న సినిమాల నుంచే పైకి వచ్చిన వాళ్లని.. చిన్న సినిమాలను తీసిపారేస్తే ఇండస్ట్రీ బతకదని చెప్పేవారు దాసరి నారయణరావు. చిన్న సినిమాలు బతికితేనే పెద్ద సినిమాలు ఉండేవి.. లేదంటే అవి లేకపోతే ఇవి కూడా లేవు.. అని చెప్పేవాళ్లు దర్శకరత్న. మరిప్పుడు చిన్న సినిమాలకు కొండంత అండగా ఉండే దాసరి అస్తమించారు. ఇప్పుడు చిన్నోళ్లకు అండగా ఎవరు ఉంటారో చూడాలి..! నిజంగా చిరు అది కూడా చేసి చూపిస్తే ఇక ఆయనకు తిరుగుండదు.