హ్యాపీ బర్త్ డే టూ విక్టరీ హీరో వెంకీ మామ..

వెంకటేష్.. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో. మరే స్టార్ హీరోకు లేని విజయాలు ఈయన సొంతం. ఒక్కటి రెండు కాదు.. ఏకంగా 80 శాతం సక్సెస్ రేట్ ఉన్న హీరో ఈయన. నిర్మాతల కొడుకులు హీరోలు కావడమే ఇండస్ట్రీలో అరుదు అంటే.. అలా వచ్చి స్టార్ అయిన మొదటి హీరో వెంకటేశ్. విజయాన్నే ఇంటిపేరుగా మార్చుకుని విక్టరీ వెంకటేశ్ అయ్యాడు ఈయన. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆరు నందులను సొంతం చేసుకున్నాడు. ఇక బయట వచ్చిన అవార్డులకు లెక్కేలేదు. శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ సినిమాలకే కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు వెంకటేశ్. రీమేక్ సినిమాలు చేయడంలోనూ వెంకటేశ్ ది అందె వేసిన చేయి.
తొలి సినిమా కలియుగ పాండవులుతోనే సంచలనం సృష్టించడంతో పాటు నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు వెంకటేశ్. ఆ తర్వాత ఒంటరి పోరాటం.. స్వర్ణకమలం లాంటి సినిమాలతో 80వ దశకంలో సత్తా చూపించాడు. ఇక 90ల్లో వెంకీ జోరుకు బ్రేకులే లేకుండా పోయాయి. బొబ్బిలిరాజా.. చంటి.. ధర్మచక్రం.. ప్రేమించుకుందాం రా.. పెళ్లిచేసుకుందాం.. కలిసుందాం రా.. జయం మనదేరా.. మల్లీశ్వరి.. నువ్వు నాకు నచ్చావ్.. ఇలా చెప్పుకుంటూ పోతే వెంకీ సాధించిన విజయాలెన్నో. ఆయనకు ఉన్నంత సక్సెస్ రేట్ తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకు లేదు. అందుకే అభిమానులు కూడా అతన్ని విక్టరీ వెంకటేష్ అంటారు.
రీమేక్ సినిమాలు చేయడంలో కూడా వెంకటేష్ తనకు తానే సాటి. మరీ ముఖ్యంగా తనకు సూటయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటూ రీమేక్ లతో రచ్చ చేసాడు వెంకీ. కుటుంబ కథాచిత్రాలకు ఇప్పటికీ వెంకటేశ్ మంచి ఛాయిస్. గత కొన్నేళ్లలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సంక్రాంతి, దృశ్యం, గురు లాంటి సినిమాలతో తనదైన ముద్ర వేసాడు వెంకటేశ్. ఈ మధ్య కాస్త జోరు తగ్గించినా కూడా ఇప్పుడు మళ్లీ వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు వెంకటేశ్. ఈ ఏడాది మొదట్లో అనిల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు వెంకీ. ఇప్పుడు వెంకీ మామ సినిమాతో ఏడాది చివర్లో తన పుట్టినరోజు నాడే వస్తున్నాడు. ఇందులో అల్లుడితో కలిసి నటించాడు వెంకటేష్. మొత్తానికి ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిద్ధాం.