జగపతిబాబును లైట్ తీసుకుంటున్నారా.. నో ఆఫర్స్..

కెరీర్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చెప్పడం కష్టమే. జగపతిబాబు విషయంలో కూడా ఇదే జరిగింది. కోట్ల రేంజ్ నుంచి హీరోగా లక్షల్లోకి పడిపోయి.. అసలు సినిమాలు చేయాలా వద్దా అనుకుంటున్న తరుణంలో లెజెండ్ సినిమాతో మళ్లీ ఊపిరి అందుకున్నాడు జేబీ. ఒకప్పుడు జగపతిబాబు అంటే ఫ్యామిలీ హీరో. శోభన్ బాబు తర్వాత శోభన్ బాబు. సాఫ్ట్ ఇమేజ్ కు ఈయన పెట్టింది పేరు. మధ్యలో కొన్ని మాస్ సినిమాలు చేసినా కూడా ఆయన మాత్రం ఎప్పుడూ క్లాస్ సినిమాలకే ఫేమస్. అలాంటి హీరోను తీసుకొచ్చి లెజెండ్ సినిమాలో రాక్షసుడిగా చూపించాడు బోయపాటి శీను. లెజెండ్ తర్వాత జగపతిబాబు కెరీర్ ఏ స్థాయిలో మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినిమాకు కోటికి పైగా పారితోషికం అందుకుంటున్నాడు జగపతిబాబు.
ఈయన ఐదేళ్ల పాటు చేతినిండా సినిమాలతో రచ్చ చేసాడు. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో అన్ని ఇండస్ట్రీల్లోనూ జేబీ నటించాడు. ఈ మధ్యే విడుదలైన సైరాలో కూడా కనిపించాడు. లెజెండ్ తర్వాత రంగస్థలంలో జగపతిబాబు కారెక్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు జేబీ లిమిట్ దాటేసిందనే ప్రచారం జరుగుతుంది. అంటే ఈయన్ని కాదని ఇప్పుడు పరభాషా నటుల వైపు మన దర్శకులు పరుగులు పెడుతున్నట్లు అనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు జేబీ డిమాండ్ తగ్గిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో ఒక ముఖ్య పాత్రకు మొదట జగపతిబాబునే తీసుకున్నప్పటికీ తర్వాత మాత్రం ఆ పాత్ర ప్రకాష్ రాజ్ కు వెళ్లింది. ఇప్పటి దర్శకులు జగపతి కంటే కూడా ముంబై ఆర్టిస్టులను ఎక్కువగా నమ్ముకోవడంతో ఈయన పని లేకుండా పోతున్నాడని తెలుస్తుంది. మొత్తానికి మళ్లీ జగపతిబాబుకు కష్టాలు మొదలైనట్లే కనిపిస్తున్నాయి.