టాలీవుడ్ లో కొత్త సాంప్రదాయం...బాలీవుడ్ తరహాలో

ధూమ్ సిరీస్ సినిమాలంటే ఇప్పటికీ ఎనలేని క్రేజ్. మనకి తెలుగులో బాహుబలి సినిమా ఎలా ల్యాండ్ మార్క్ గా నిలిచిందో అలానే అప్పట్లో బాలీవుడ్ లో తన మార్క్ వేసుకుంది ఆ సిరీస్ సినిమాలు. నిజానికి ఈ సినిమాలో విలనిజానికే ప్రధాన్యత ఎక్కువ. కథ మొత్తం విలన్ పాత్రధారి నుండే నడుస్తుంటుంది. ఆ నెగటివ్ పాత్రకు అంత డిమాండ్ ఉంది కాబట్టే అగ్ర కథానాయకులు సైతం ఆ పాత్రలు పోషించారు. మూడు సిరీస్ లలో తొలి భాగంలో జాన్ అబ్రహం, రెండో సిరీస్‌లో హృతిక్ రోషన్, మూడో భాగంలో అమీర్ ఖాన్ లు విలన్లుగా నటించారు. ఇదే ఫార్ములా ని ఫాలో అవుతూ తెరకేక్కిస్తున్నారట నాని, సుధీర్ బాబు కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’. సరికొత్త లైన్ తో దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని ప్రతినాయక షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా సుధీర్ బాబు హీరో పాత్రలో నటిస్తున్నాడు. ‘వి’ సినిమాని కూడా పలు సిరీస్ లలో భాగంగా షూట్ చేసే ఆలోచనలో ఉందట సినిమా యూనిట్. ‘ధూమ్’ తరహాలో ఒక సుధీర్ బాబు పాత్రను ఉంచి, ఎదురు నిలిచే ప్రతినాయక పాత్రను మాత్రం మార్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇదే నిజమైతే టాలీవుడ్ లో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లే.