కేజీఎఫ్ కి టైం దగ్గర పడినట్టే...సంజయ్ దత్ ప్రకటన

గతేడాది చివర్లో కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి విడుదలైన కెజీఎఫ్ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం ఆడియన్స్ మౌత్ టాక్ తో ఘనవిజయం సాధించి ఒక్క కన్నడ ఇండస్ట్రీకే ఆగిపోకుండా హిందీ పాటు సౌత్ ఇండియాలో విడుదలయిన అన్ని భాషల్లో విజయ విహారం చేసింది. ఈ సినిమా ఇంత ఎత్తున ఫేమస్ కావడంతో కేజీఎఫ్‌కు కొనసాగింపుగా కేజీఎఫ్ ఛాప్టర్ 2ని తెరకెక్కిస్తున్నారు.
అయితే సినిమా రిలీజ్ అయ్యాక యష్ తో పాటు కేజీఎఫ్ కి కూడా మార్కెట్ పెరగడంతో బాలీవుడ్ సహా కొన్ని బాషలలో కీలకమైన పాత్రల కోసం స్టార్ నటులను రోప్ చేశారు. యష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీరా పాత్రలో నటిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు తొలి భాగాన్ని మించి ఎన్నో హంగులు ఈ సినిమాకు జోడిస్తున్నారు. ఇటీవల సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో సంజూ లుక్ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 21 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయాన్ని నటుడు సంజయ్ దత్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించాడు. డిసెంబర్ 21 సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు కేజీఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని సంజు వెల్లడించాడు. మొదటి భాగంలో విలన్ గరుడనే ఒక రేంజ్లో చూపించిన దర్శకుడు ప్రశాంత్, అధీరాగా సంజయ్ దత్ మరో రేంజ్ లో చూపిస్తాడనడంలో సందేహం లేదు. ఆ పూర్తి భీబత్సం చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే. యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రవినా టండన్, అనంత్ నాగ్, మాళవిక అవినాష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2020 జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.