English   

దిగ్గజ దర్శకుడు దిగజారుతున్నాడా..

RGV
2019-12-17 16:09:57

శివ సినిమాతో అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమాను మార్చేసాడు వర్మ. రాత్రికి రాత్రే ఆయన స్టార్ అయిపోయాడు. సినిమా అంటే ఇలాగే తీయాలని ఓ బౌండరీస్ లో బతుకుతున్న తెలుగు సినిమాకు ఈయన కొత్త గీతను చూపించాడు. సినిమా అంటే ఇలా కూడా తీయొచ్చంటూ శివతో నిరూపించాడు. అప్పట్లో ఆయన చేసిన ఈ సినిమా ఇప్పటికీ చూస్తుంటే కొత్తగానే అనిపిస్తుంది. ఆ తర్వాత కూడా వర్మ చేసిన సంచలన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే సంచలనమే. బాలీవుడ్ లో కూడా రంగీలా, కంపెనీ, సర్కార్.. ఇలా ఎన్నో సినిమాలు చేసాడు. అందుకే రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 

ఆయన ఎలా ఆలోచిస్తాడో.. ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎంచుకునే కథలు తెరకెక్కించే సినిమాలే వర్మ అంటే ఏంటో చూపిస్తాయి. కానీ ఇప్పుడు ఈయన స్థాయి దిగజారుతుంది. ఇన్ని రోజులు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు వర్మ మరీ దిగజారుతున్నాడనే సంకేతాలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు అంటూ చాలామంది మండిపడుతున్నారు. ముఖ్యంగా మొన్న విడుదలైన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా వర్మ కుంచిత మనస్తత్వాన్ని బయట పెడుతుంది అంటున్నారు విశ్లేషకులు. అసలు ఇలాంటి సినిమాలు ఎలా తీస్తారు.. అసలు ఒకర్ని కించపరిచేలా కారెక్టర్స్ ఎలా రాస్తారు.. అంటూ ఆయనపై విమర్శలు పడుతున్నాయి. 

ఒకప్పుడు వర్మ చేసిన సినిమాలేంటి.. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలేంటి.. శివ, గాయం, క్షణక్షణం లాంటి సంచలన సినిమాలు చేసిన వర్మ ఇప్పుడు తెలుగులో ఇంత చెత్త సినిమాలు ఎలా చేస్తున్నాడు అంటూ ఆయనతో ఆడుకుంటున్నారు విమర్శకులు. అవతల వ్యక్తి వ్యక్తిత్వాన్ని మరీ అంతగా అవమానించేలా సినిమాలు ఎలా తీస్తున్నారంటూ వర్మపై మండిపడుతున్నారు అభిమానులు. ఇక ఈ మధ్య కాలంలో ఆయన చంద్రబాబును, తెలుగు దేశం పార్టీని విమర్శిస్తూ సినిమాలు చేస్తున్నాడు. దాంతో తెలుగు తమ్ముళ్లు కూడా రామ్ గోపాల్ వర్మ పై నిప్పులు చెరుగుతున్నారు. 

ఇంత దారుణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం.. అతన్ని కించపరచడం ఏ విధంగా ఒక సినిమా దర్శకుడికి ఉచితమైన విధానం అంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమా అంటే పదిమందికి మంచి చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకూడదు అంటారు. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం కేవలం చెడు చెప్పడానికే సినిమాలు చేస్తున్నాడు అంటూ ఒక వర్గం మండిపడుతుంది. ఇది ఆయన వరకు వెళ్లిందా లేదా అనేది పక్కనపెడితే అమ్మరాజ్యంలో సినిమా తర్వాత మాత్రం వర్మను చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయనలాంటి దిగ్గజ దర్శకుడు ఇలాంటి సినిమాలు అవసరమా అంటూ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. మరి దీనిపై ఆయన ఏం సమాధానం చెబుతాడో చూడాలి. 

More Related Stories