English   

రజినీకాంత్‌ను నిలదీస్తున్న అభిమానులు.. 

Rajinikanth
2019-12-18 13:26:15

దేవుడు శాసించాడు.. నేను పాటించాను అంటూ ఏడాదిన్నర కింద రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు రజనీకాంత్. అప్పుడు ఒక్కసారి శాసించిన దేవుడు మళ్లీ ఇప్పటివరకు రజనీకాంత్ ను శాసించడం మర్చిపోయినట్లున్నాడు. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సంగతి కూడా మర్చిపోయి హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన తీరు అభిమానులకు కూడా కోపం తెప్పిస్తుంది. రజినీకాంత్ తీరుపై కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకపోతే రాను అని చెప్పాలి అంతే కానీ వచ్చిన తర్వాత ఇలా వరుసగా సినిమాలు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు రజనీకాంత్. దీన్ని బట్టి ఆయన రాజకీయాలను లైట్ తీసుకుంటున్నారా లేదంటే నేరుగా ఎన్నికలకు పోయినా కూడా కేవ‌లం తన బొమ్మ చూసి ఓట్లు వేస్తారని అతివిశ్వాసంతో ఉన్నాడో అర్థం కావ‌డం లేదు. ఓ వైపు కమల్ హాసన్ లోక్ స‌భ‌ ఎన్నికల్లో పోటీ చేసాడు. కానీ రజినీ మాత్రం 2021 వరకు వేచి చూస్తానని చెబుతున్నాడు. ఇప్పుడు వస్తున్న మున్సిపల్ ఎలక్షన్స్‌లో కూడా తన పార్టీ పోటీ చేయట్లేదని కన్ఫర్మ్ చేసాడు ర‌జినీకాంత్.

రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా కూడా ఏమీ పట్టనట్లు వరసగా సినిమాలు చేయడం అభిమానులను సందిగ్ధంలో పడేస్తుంది. ఇప్పటికైనా ఈయన ఓ నిర్ణయం తీసుకోవాలని.. రాజకీయాల్లోకి సీరియస్ గా వస్తున్నాడా లేదంటే సినిమాలతోనే బిజీ అవుతున్నాడా చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది కాలా, 2.0 సినిమాలతో వచ్చిన ర‌జినీకాంత్.. ఈ ఏడాది పేటతో వచ్చాడు. ఇప్పుడు దర్బార్ షూటింగ్ కూడా పూర్తి చేసాడు. ఇది సంక్రాంతికి విడుదల కానుంది. 

ఇక ఇప్పుడు సిరుత్తై శివతో మరో సినిమా ఓకే చేసాడు. ఈ సినిమా తర్వాత కార్తిక్ సుబ్బరాజుతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు రజినీకాంత్. ఇలా వరసగా సినిమాలు చేస్తుంటే ఈయన రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడని అడుగుతున్నారు అభిమానులు. దాంతోపాటే రజినీ వస్తాడు.. మార్పు తెస్తాడని నమ్ముతున్న మిగిలిన వాళ్లు కూడా ఈయన రాక కోసం చూస్తున్నారు. వరసగా సినిమాలు చేస్తుంటే ఇక రాజకీయాలు ఎందుకు అంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. వ‌ర‌స‌గా ర‌జినీ సినిమాలు చేస్తుంటే ఆనందంగానే ఉంది కానీ రాజ‌కీయాల ప‌రిస్థితి ఏంటి అంటూ అభిమానులు నిల‌దీస్తున్నారు. 

రజినీకాంత్ తీరు చూస్తుంటే ఇప్పట్లో కదిలేలా కనిపించడం లేదు. ఈయన మనసు పూర్తిగా సినిమాలపైనే ఉంది. కమల్ హాసన్ మాత్రం పూర్తిగా ఓ నిర్ణయం తీసుకుని అక్కడే కట్టుబడి ఉన్నాడు. భారతీయుడు 2 సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లో బిజీ అవుతానని చెప్పాడు కమల్. అందుకే కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు. కానీ రజినీ మాత్రం అలా కాదు.. ఆయన అటూ ఇటూ ప్రయాణం చేస్తున్నాడు. రెండు పడవల ప్రయాణం ఎప్పటికైనా డేంజర్. దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నారు రజినీ అభిమానులు. మరి ఏం జరుగుతుందో చూడాలిక. 

More Related Stories