English   

ఇచ్చిన మాట తప్పిన గీతా ఆర్ట్స్.. ఆ తర్వాత క్షమాపణలు..

geetha
2019-12-20 05:08:23

అల్లు అర్జున్ అభిమానులు ప్రస్తుతం అల వైకుంఠపురంలో సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్.. ప్రతి పాట అన్నింటినీ బాగా ఓన్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అందుకే సినిమా నుంచి విడుదలైన సామజవరగమన, రాములో రాములా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రెండు పాటలు యూట్యూబ్ లో సంచలన రికార్డులను తిరగరాశాయి. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఓకే సినిమా నుంచి రెండు పాటలు 100 మిలియన్ల మార్కును అందుకున్నాయి. ఈ క్రమంలోనే అల వైకుంఠపురములోని మరో పాట బుట్టబొమ్మ సాంగ్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పాటను విడుదల చేయలేదు. ఇదే విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్విట్టర్​ వేదికగా తెలిపింది. త్వరలోనే సినిమా విశేషాలు పంచుకుంటామని వెల్లడించింది.

ఈ అంతరాయానికి క్షమించాల్సిందిగా ప్రేక్షకులను కోరింది. గతంలో రాములో రాముల పాట విషయంలో కూడా ఇలాగే చేశారు గీతా ఆర్ట్స్ సంస్థ. అప్పుడు కూడా ఒక రోజు విడుదల కావాల్సిన పాటను మరో రోజు విడుదల చేశారు. సాంకేతిక కారణాల వల్ల ఆ పాట కూడా ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు బుట్ట బొమ్మ పాట విషయంలో కూడా ఇదే చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. టబు, జయరాం, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, నవదీప్, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories