రూలర్ రివ్యూ

నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా రూలర్. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. బాలయ్య గత చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు దారుణమైన రిజల్ట్ రావటంతో అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. బాలకృష్ణ, కేయస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైసింహాకు హిట్ టాక్ రావటంతో ఈ సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా బాలయ్య కూడా డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్ద్దాం.
కథ:
తీవ్రమైన గాయాలతో దొరికిన బాలయ్యను పెద్ద వ్యాపారవేత్త అయిన సరోజినీ దేవి(జయసుధ) చేరదీసి తన వ్యాపార లావాదేవీలకు అండగా ఉండాలని అతనికి ఓ గతం ఉంది అని కూడా అతనికి తెలీకుండా పెద్ద బిజినెస్ మాగ్నెట్ గా మార్చేస్తుంది. దీంతో అర్జున్ ప్రసాద్ తన ఐటీ కంపెనీని నెంబర్ వన్ కంపెనీగా మారుస్తాడు. కంపెనీని డెవలప్ చేసే క్రమంలో భాగంగా అర్జున్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్‌లో తమ కంపెనీ ఆపేసిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలనుకుని అక్కడకు వెళతాడు. అక్కడ తన తల్లికి జరిగిన అవమానానికి బదులు తీర్చుకునే క్రమంలో కథ మలుపు తిరుగుతుంది. అక్కడ అందరూ అర్జున్‌ని ధర్మ అని పిలుస్తారు. అసలు పోలీస్ ఆఫీసర్ ధర్మ గురించి అర్జున్‌కి తెలిసిన నిజమేంటి? ఇక్కడ పోలీస్ రోల్ లో కనిపించే బాలయ్య ఎవరు?అన్న విషయాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
నందమూరి బాలకృష్ణ సినిమా కదా మాస్ సీన్స్ ఉంటాయి అనుకుని వెళ్ళిన వారికీ మరోసారి పరమ రొటీన్ కథతో వచ్చి సహనానికి పరీక్ష పెట్టాడు బాలయ్య. ఆయన తన ఇమేజ్ ను కూడా పూర్తిగా పణంగా పెట్టి కె.ఎస్.రవికుమార్ మాయలో పడిపోయాడనిపించేలా ఉంది ఈ సినిమా. కొన్ని వందల సార్లు చూసిన కథను దర్శకుడు మళ్లీ చెప్పినా మళ్లీ ఒప్పుకున్నాడు బాలకృష్ణ. గతంలో ఆయన చేసిన లయన్, విజయేంద్ర వర్మ లాంటి కథలే ఈ సినిమాలో గుర్తుకొస్తాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఒకదాన్ని మించి ఒకటి సహనానికి పరీక్ష పెట్టాయి. బాలకృష్ణ లాంటి స్థాయి ఉన్న హీరో సినిమాలో వెకిలి కామెడీ చేయించడం ఎవరికీ నచ్చదు. రైతుల గురించి చెప్పిన డైలాగులు బాగున్నాయి కానీ ఇతివృత్తంగా తీసుకుని తీర్చిదిద్దిన కథ మాత్రం ఆకట్టుకోలేదు. అనవసరంగా వచ్చే సన్నివేశాలు.. అర్థం పర్థం లేని యాక్షన్ సీన్స్ అస్సలు ఆకట్టుకోలేదు.
నటీనటులు :
కథ ఎలా ఉన్నా బాలకృష్ణ మాత్రం మరోసారి ఇరగదీశాడు. ఆయన ఎనర్జీకి నిజంగానే దండం పెట్టొచ్చు. పడతాడు పాటలో బాలయ్య డాన్సులు అదుర్స్ అనే చెప్పాలి. హీరోయిన్లు కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయ్యాయి. భూమిక, ప్రకాష్ రాజ్, శ్రీనివాసరెడ్డి, రఘు వంటి వారు తామ తమ పరిధి మేర నటించారు. చిరంతన్ భట్ అందించిన సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. పరుచూరి మురళి అందించిన కథ, కథనాలు ఏమాత్రం కొత్తగా అనిపించలేదు. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఓవరాల్ గా రూలర్ రూల్ చేయకపోగా మన బుర్ర ను బాగా రోల్ చేస్తుంది..
రేటింగ్: 2 /5.