English   

దొంగ రివ్యూ

donga
2019-12-20 19:46:16

ఖైదీ సినిమాతో తెలుగులో మార్కెట్ మరింత పెంచుకున్నాడు కార్తి. ఇప్పుడు దొంగ అంటూ మరోసారి చిరంజీవి టైటిల్ నమ్ముకుని వచ్చాడు. దానికితోడు వదిన జ్యోతికతో కలిసి నటించాడు. అన్నింటికి మించి దృశ్యం లాంటి సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకుడు కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి ఈ చిత్రంతో కార్తి ఎంతవరకు ఆకట్టుకున్నాడు..?

కథ:
ఙ్ఞానమూర్తి(సత్య రాజ్) ఊరిపెద్ద.. రాజకీయ నాయకుడు కూడా. అక్కడే అడవుల్లో ఉండే ప్రజల మంచి చెడులు చూస్తుంటాడు. ఆయన కొడుకు శర్వా.. ఇంట్లో జరిగిన గొడవతో చిన్నపుడే ఇంట్లోంచి పారిపోతాడు. అప్పట్నుంచి 15 ఏళ్లుగా కొడుకు కోసం వెతుకుతూనే ఉంటాడు జ్ఞానమూర్తి. అయినా కూడా లాభం ఉండదు. శర్వా అంటే అక్క పార్వతి (జ్యోతిక)కి ప్రాణం. అదే సమయంలో గోవాలో ఉండే ఓ పోలీస్ ఆఫీసర్ శర్వా ఆచూకి జ్ఞానమూర్తికి చెప్తాడు. అప్పటికే అక్కడ దొంగతనాలు, మోసాలు చేస్తున్న విక్కీ (కార్తీ)నే శర్వా అని చెప్తాడు పోలీస్. దాంతో శర్వాగా ఆ ఇంట్లోకి వెళ్తాడు.. అక్కడ అందర్నీ నమ్మిస్తుంటాడు. కానీ అదే సమయంలో శర్వా తనను తాను అక్కడ నిరూపించుకోడానికి చాలా ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాడు..? అసలు శర్వా ఎందుకు ఇంట్లోంచి పారిపోయాడు.. అక్కడ్నుంచి అసలు కథ ఏంటి అనేది మిగిలిన స్టోరీ..

కథనం:
కొందరు హీరోలు కథలు లేక అల్లాడిపోతుంటే.. కార్తి మాత్రం మంచి కథలకు వెతికి పట్టుకుంటున్నాడు.. ఖైదీ మత్తు ఇంకా దిగనేలేదు.. అప్పుడే దొంగ అంటూ వచ్చాడు కార్తి.. మరోసారి మంచి కథనంతో వచ్చి ఆకట్టుకున్నాడు ఈ హీరో.. చిన్న లైన్ తీసుకుని దానికి పట్టుసడలని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు జీతూ జోసెఫ్.. తెలిసిన కథే అయినా కూడా కథనం బాగుండటంతో నెక్ట్స్ ఏంటి అనే క్యూరియాసిటీ పెరుగుతుంది.. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా వినోదాత్మకంగా సాగింది..  అక్కడక్కడా స్లో అయినా కూడా తన కామెడీ టైమింగ్‌తో నెట్టుకొచ్చాడు కార్తి.. సెకండాఫ్ మొదలైన తర్వాత చాలా చోట్ల దృశ్యం మళ్లీ కనిపించింది.. ఇన్నేళ్లైనా కూడా దృశ్యం తాలూకు గుర్తులు ఇంకా జీతూ జోసెఫ్‌ను వదల్లేదనిపించింది.. ఓ మర్డర్ సీన్.. క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్.. వచ్చే ఫ్లాష్ బ్యాక్.. అన్నీ మనకు దృశ్యంలో కూడా కాస్త సిమిలర్‌గా కనిపిస్తాయి.. అయినా ఆకట్టుకుంటాయి.. కార్తి, జ్యోతిక మధ్య వచ్చే సన్నివేశాలను బాగా డిజైన్ చేసుకున్నాడు జీతూ జోసెఫ్.. ఓ చిన్నపిల్లాడికి కార్తితో వచ్చే కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది..  సత్యరాజ్, కార్తి మధ్య సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డల్ అయింది.. కానీ క్లైమాక్స్ అదిరిపోయింది.. ఆ ఒక్క ట్విస్ట్‌తో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయం.. కార్తి మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.. జ్యోతిక సినిమాకు మరో బలం.. సత్యరాజ్ టిపికల్ పాత్రలో మెప్పించాడు.. హీరోయిన్ నిఖిలా విమల్ పర్లేదు.. ఓవరాల్‌గా దొంగ.. దృశ్యం లాంటి ఓ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫ్యామిలీ డ్రామా.

నటీనటులు:
ఈ సినిమాకు ప్రధాన హైలైట్ కార్తి. అసలు మనోడి నటనకు ఫిదా కానీ వాళ్లంటూ ఉండరు. కామెడీ.. యాక్షన్.. డ్రామా.. ఎమోషన్ అన్నింట్లోనూ అదరగొట్టాడు. జ్యోతికతో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. ఇక జ్యోతిక కూడా కార్తితో పోటీపడి నటించింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాకు హైలైట్. సత్యరాజ్‌కు సినిమాలో భిన్నమైన కోణాల్లో నటన ప్రదర్శించే అవకాశం దొరికింది. ఓ సారి పాజిటివ్.. మరోసారి నెగిటివ్.. ఇలా చాలా కోణాలున్నాయి ఈ కారెక్టర్‌‌లో. హీరోయిన్ నిఖిలా విమల్‌కు పెద్దగా స్కోప్ లేదు. 15 ఏళ్ళ తర్వాత వచ్చిన ప్రియుడి కోసం తపించే అమ్మాయిగా నటించింది అంతే. కన్నింగ్ పోలీస్ అధికారిగా ఇళవరసి.. జ్యోతిక ట్యూషన్ స్టూడెంట్‌గా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:
గోవింద వసంత్ అందించిన మ్యూజిక్ బాగుంది. పాటల సంగతి పక్కనబెడితే ఆర్ఆర్ అదిరిపోయింది. సినిమాటోగ్రాఫర్ ఆర్డీ రాజశేఖర్ కెమెరా పనితనం బాగుంది. అడవుల అందాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ పర్లేదు. దర్శకుడిగా జీతూ జోసెఫ్ మరోసారి దృశ్యం దారిలోనే వెళ్లినట్లు అనిపిస్తుంది. అప్పటంత మాయ చేయకపోయినా కూడా చాలా వరకు కవర్ చేసాడు. క్లైమాక్స్ ట్విస్ట్‌తో సినిమా స్వరూపం మారిపోయింది.

చివరగా:
దొంగ.. దృశ్యం కాని దృశ్యం.. ఇది కార్తి దృశ్యం..

 

More Related Stories