English   

యాంకర్స్ హీరోలవుతున్నారుగా.. నేటి యాంకర్లే రేపటి హీరోలు..

anchors
2019-12-22 07:32:50

బుల్లితెర‌పై క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. యాంక‌రింగ్ లో చాలా తిప్ప‌లుంటాయి. హోస్టింగ్ చేసిన వాళ్ల‌కు పెద్ద స్క్రీన్ పై క‌నిపించ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. బుల్లితెరపై వాళ్ల‌కు ఫుల్ గా క్రేజ్ ఉంటుంది. అదే క్రేజ్ ను ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు వాడుకుంటున్నారు. తెలుగులో ఉన్న ఫీమేల్ యాంక‌ర్లు ఇప్ప‌టికే హీరోయిన్లు మారిపోయారు. కానీ మేల్ యాంక‌ర్లే ఇప్ప‌టి వ‌ర‌కు హీరోలుగా రాలేదు. త‌న‌దైన మాస్ యాంక‌రింగ్ తో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న‌ ర‌వి.. ఆ మధ్య హీరో అయిపోయాడు. బుల్లితెర‌పై ప‌టాస్ లాంటి సూప‌ర్ హిట్ ప్రోగ్రామ్స్ చాలానే చేసిన ఈ కుర్ర యాంక‌ర్.. ఇది మా ప్రేమ‌క‌థ అంటూ వచ్చాడు. కానీ ఆ సినిమా ఆడలేదు. ఈ చిత్రాన్ని అయోధ్య కార్తిక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా రవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అప్పట్లో చిరంజీవితో కూడా ప్రశంసలు అందుకున్నాడు రవి. ఇక ఇప్పుడు ప్ర‌దీప్ కూడా హీరోగా మారుతున్నాడు. ఇప్ప‌టికే కొన్ని సినిమాల్లో కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించాడు ప్ర‌దీప్. లీడ్ ఆర్టిస్ట్ గా మాత్రం న‌టించ‌లేదు.

ఎందుకో ఆ వైపుగా దృష్టి పెట్ట‌లేదు కూడా. ఇన్నాళ్ల‌కు మ‌నోడు ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి.. హీరోగా మారుతున్నాడు. ఇప్పటికే చారిత్రక నేపథ్యంలో ఓ సినిమాను మొదలుపెట్టాడు ఈయన. సుకుమార్ శిష్యుడు దీనికి దర్శకుడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మరో సినిమాకు కూడా కమిటయ్యాడు. దీన్ని కూడా ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. ఇందులో లవ్ గురుగా నటించబోతున్నాడు ప్రదీప్. తెలుగులో ఇంకా యాంక‌ర్లు హీరోలుగా స‌క్సెస్ కాలేదు కానీ త‌మిళ‌నాట మాత్రం అది జ‌రిగింది. అక్క‌డ ఇద్ద‌రు అగ్ర హీరోలు యాంక‌రింగ్ నుంచి వ‌చ్చిన వాళ్లే. వ‌ర‌స విజ‌యాల‌తో కోలీవుడ్ ను దున్నేస్తోన్న శివ‌కార్తికేయ‌న్ చిన్న చిన్న ఈవెంట్స్ కు.. ప్రోగ్రామ్స్ కు హోస్టింగ్ చేసిన‌వాడే. అచ్చంగా ర‌వి మాదిరే ఫుల్ ఎన‌ర్జీతో ఉంటాడు శివ‌. మెరీనా సినిమాతో హీరోగా ప‌రిచ‌యమై.. ఆ త‌ర్వాత వ‌ర‌స విజ‌యాల‌తో స్టార్ అయ్యాడు శివ కార్తికేయ‌న్. విజ‌య్ సేతుప‌తి కూడా ఇంతే. ఈయ‌న కూడా ముందు యాంక‌రింగ్ చేసాడు. మ‌ధ్య‌లో కొన్ని టీవీ సీరియ‌ల్స్ కూడా చేసాడు. ఆ త‌ర్వాతే హీరో అయ్యాడు. తెలుగులోనూ ర‌వి, ప్రదీప్ ఈ ట్రెండ్ కు తెర తీస్తాడని ఆశిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ గ‌న‌క హీరోగా స‌క్సెస్ అయితే.. ఇప్పుడు ఉన్న మేల్ యాంక‌ర్ల‌కు ఇదో బూస్ట‌ప్ అవుతుంది. మ‌రి చూడాలి.. ఈ కుర్ర యాంక‌ర్ల క‌హానీ ఎంత‌మందిని ఆక‌ట్టుకుంటుందో..?

More Related Stories