దర్శకుడు రాఘవ లారెన్స్ సంచలన నిర్ణయం.. ఆందోళనలో అభిమానులు..

ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ అనే పదం చాలా తక్కువ మందికి అప్లై అవుతుంది. అందులో రాఘవ లారెన్స్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి. నటుడు దర్శకుడు నిర్మాత సంగీత దర్శకుడు ఇలా చాలామంది ఈయనలో ఉన్నారు. అన్నింటికీ మించి మంచి మనిషి కూడా. ఇలాంటి లారెన్స్ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎలాంటి వేడుకలకు కానీ ఈవెంట్స్ కు గాని హాజరు కాను అని ట్విట్టర్ వేదికగా తెలిపాడు లారెన్స్. దీని వెనుక ఒక కారణం ఉంది.
దర్బార్ సినిమా ఆడియో వేడుక ఈయనను విమర్శల పాలయ్యేలా చేసింది. హాయ్ ఫ్రెండ్స్.. ఫ్యాన్స్ నేను మీకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇక నుంచి బయట జరిగే ఏ కార్యక్రమానికి నేను హాజరుకాను. తలైవర్(రజనీకాంత్) కార్యక్రమానికి కూడా ఆయన అనుమతి లేకుండా రాను.. దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి.. అవన్నీ నేను మీతో పంచుకోలేను. ఆయన(రజనీ) దీవెనలు కన్నా ఏదీ ఎక్కువ కాదు అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు లారెన్స్. ఉన్నట్టుండి ఆయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. ఆ మధ్య రజనీకాంత్ దర్బార్ సినిమా ఆడియో వేడుకలో కమల్ హాసన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
తాను చిన్నప్పటి నుంచి రజినీకాంత్ అభిమానినని.. అప్పట్లో ఆయన సినిమా వస్తే చొక్కాలు చించుకుని వాడిని అని చెప్పాడు లారెన్స్. కమల్ సినిమా పోస్టర్లపై పేడ కొట్టేవాడిని అంటూ లారెన్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అప్పట్లో పరిస్థితులు అలా ఉండేవి కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తున్నారు. స్నేహబంధం కన్నా గొప్పది ఏదీ కాదని ఇప్పటికి నాకు అర్థమైందని మళ్ళీ వెంటనే తన తప్పును సర్దుకున్నాడు లారెన్స్ కానీ ఈయన చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి. దాంతో బాగా హర్ట్ అయిన లారెన్స్ ఇకపై తాను పబ్లిక్ ఈవెంట్స్ కు హాజరు కాను అంటూ నిర్ణయం తీసుకున్నాడు.