English   

మహేష్ బాబు వదిలేసిన బ్లాక్ బస్టర్ సినిమాలేంటో తెలుసా..

Mahesh babu
2019-12-24 19:13:37

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. ముఖ్యంగా కొందరు దర్శకులు అయితే కేవలం మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకున్నారు కానీ ఆయన మాత్రం వాటిని మిస్ చేసుకున్నాడు. ఆ సినిమాలు కానీ మహేష్ చేసుంటే కచ్చితంగా ఆయన రేంజ్ మరింతగా పెరిగుండేది. బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా కొన్ని వదిలేసాడు సూపర్ స్టార్. ముఖ్యంగా ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు కూడా కాదనుకున్నాడు మహేష్ బాబు. అందులో కొన్ని సినిమాలు ఇప్పుడు మనం చూద్దాం..

1. 24

సూర్య హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయం సాధించకపోయినా కూడా మంచి గుర్తింపు మాత్రం తెచ్చుకుంది. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అంటూ ఈ దర్శకుడిని ఆకాశానికి ఎత్తేసారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది 24 సినిమా. ఈ చిత్ర కథ నచ్చి సూర్య స్వయంగా తనే నిర్మించాడు కూడా. ఈ చిత్రంలో ముందు మహేష్ బాబునే హీరోగా అనుకున్నాడు విక్రమ్. అప్పట్లో ఈ సినిమాపై వార్తలు కూడా వచ్చాయి. కానీ అనుకోని కారణాలతో 24 సినిమా నుంచి ఆయన తప్పుకున్నాడు. సూర్య వచ్చాడు.. ఈ చిత్రం తెలుగులో విజయం సాధించినా కూడా తమిళనాట మాత్రం కమర్షియల్ ఫ్లాప్ అయింది. మహేష్ చేసుంటే మాత్రం సినిమా రేంజ్ కచ్చితంగా మరోలా ఉండేదంటున్నారు అభిమానులు.

2. స్నేహితుడు

దర్శకుడు శంకర్ తన కెరీర్ లో చేసిన ఏకైక రీమేక్ స్నేహితుడు.. తమిళంలో నమ్బన్. విజయ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 3 ఇడియట్స్ సినిమాకు రీమేక్. కథ నచ్చి సౌత్ ఆడియన్స్ కు కూడా అందించాలనే ఉద్ధేశ్యంతో ఈ సినిమాను రీమేక్ చేసాడు శంకర్. ఈ సినిమా తెలుగు రీమేక్ లో మహేష్ బాబును నటింపచేయాలని చాలా ప్రయత్నించాడు శంకర్. కానీ ఈయన రీమేక్ సినిమాలు చేయనని చెప్పడంతో విజయ్ సినిమానే ఇక్కడ కూడా డబ్ చేసారు. లేదంటే తెలుగులో మహేష్.. తమిళంలో విజయ్ హీరోలుగా ఒకేసారి ఈ చిత్రాన్ని రీమేక్ చేసేవాడు శంకర్. అలా స్నేహితుడు సినిమాను మహేష్ బాబు మిస్ అయ్యాడు.

3. ఏ మాయ చేసావే

నాగ చైతన్య కెరీర్ ను మార్చేసిన సినిమా.. సమంతను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా ఏ మాయ చేసావే. జోష్ సినిమా ప్లాప్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియక చూస్తున్న నాగ చైతన్య కెరీర్ ను సరైన గాడిన పెట్టిన సినిమా ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా లవ్ సబ్జెక్టులలో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాను ముందు మహేష్ బాబుతోనే ప్లాన్ చేసాడు గౌతమ్. తమిళంలో శింబు.. తెలుగులో మహేష్ తో ఒకేసారి చేయాలనుకున్నా కూడా ఎందుకో ఇంత సాఫ్ట్ స్టోరీలో నటించడానికి మహేష్ మనసు ఒప్పుకోలేదు. దాంతో చైతూ కెరీర్ గాడిన పడింది.

4. మనసంతా నువ్వు

రాజకుమారుడు తర్వాత మహేష్ బాబు హీరోగా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ మనసంతా నువ్వే ప్లాన్ చేసింది. అయితే అప్పుడు మరి ఇంత సాఫ్ట్ ప్రేమకథ అంటే ఇమేజ్ పోతుందేమో అని భయపడి మహేష్ బాబు వెనక్కి తగ్గాడు. వంశీ, యువరాజు లాంటి మాస్ సినిమాలు చేసాడు. కానీ అవి ఫలితాలు ఇవ్వలేదు. చివరికి రెండేళ్ల తర్వాత ఉదయ్ కిరణ్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాడు విఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే అప్పట్లో సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పడం కష్టమే. అంతగా సంచలనాలు రేపింది. ఉదయ్ కిరణ్ ను సూపర్ స్టార్ గా మార్చేసింది ఈ చిత్రం. మహేష్ చేసుంటే ఆ రేంజ్ మరోలా ఉండేదేమో..?

5. కత్తి

తమిళనాట విజయ్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో చిరంజీవి తన 150వ సినిమా కోసం ఈ కథనే ఎంచుకున్నాడు. రైతుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాను మహేష్ బాబుతో రీమేక్ చేయాలనుకున్నాడు మురుగదాస్. కానీ మహేష్ మాత్రం మరోసారి రీమేక్ చేయనని తెగేసి చెప్పడంతో కత్తి మిస్ అయిపోయింది. అలా బ్లాక్ బస్టర్ సినిమాను కూడా మిస్ చేసుకున్నాడు సూపర్ స్టార్.

6. రుద్రమదేవి

గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాలో కూడా నటించే అవకాశం వదిలేసుకున్నాడు సూపర్ స్టార్. ఇందులో గోన గన్నారెడ్డి పాత్ర కోసం మహేష్ బాబునే అడిగాడు గుణశేఖర్. ఆయనతో మూడు సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కచ్చితంగా చేస్తాడనే నమ్మకంతో అడిగినా కూడా ఆయన మాత్రం నో చెప్పాడు. దాంతో మహేష్ బాబు వదిలేసిన పాత్రలోకి బన్నీ వచ్చాడు. గోన గన్నారెడ్డి పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.

7. అ..ఆ..

నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అ..ఆ.. సినిమాలో కూడా ముందు మహేష్ బాబే హీరో. కానీ ఆయన కాదనుకున్న తర్వాతే నితిన్ వచ్చాడు. మహేష్ కాదనడంతో సమంత పాత్రకు మరింత వెయిటేజ్ పెంచేసాడు త్రివిక్రమ్. ఆ తర్వాత కథలోకి నితిన్ వచ్చాడు. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయింది. అ.. ఆ సినిమాలో కానీ మహేష్ నటించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి.. కానీ ఏం చేస్తాం ఆయన కాదన్నాడు. ఏదేమైనా కూడా ఇలా తన కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు తనకు తెలియకుండానే వదిలేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

More Related Stories