పవన్ కళ్యాణ్.. కింగ్ ఆఫ్ సినిమా.. గేమ్ ఛేంజర్ ఆఫ్ పాలిటిక్స్..

కొణిదెల కళ్యాణ్ బాబు ఉరఫ్ పవన్ కళ్యాణ్.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు. కాదు కాదు.. మిగిలిన హీరోలకు కేవలం అభిమానులు మాత్రమే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు. అదేం విచిత్రమో కానీ హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్ పవన్ సొంతం. ఈయన ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు. ఇన్నాళ్లూ సినిమాల్లో ఎక్కువగా వినిపించిన ఈయన పేరు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో మార్మోగిపోతుంది.
మొన్నటి ఎన్నికల్లో అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా పవన్ ప్రజల మద్య తిరుగుతున్న తీరు చూసి ఆయన ధైర్యానికి మెచ్చుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తలపండిన రాజకీయ నాయకులు కూడా ఓడిపోతే కామ్ గా ఇంట్లో కూర్చుంటారు కానీ ఈయన మాత్రం ఇప్పటికీ జనం జనం అంటున్నాడు. సినిమాల్లో మరో 20 ఏళ్ల పాటు రాజమార్గాన్ని వదిలేసి ఐదేళ్ల కింద జనసేన పార్టీని స్థాపించాడు పవర్ స్టార్. దానికి ముందు అన్నయ్య ప్రజారాజ్యంలో కూడా పని చేసాడు కానీ అప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ చేయలేదు పవన్ కళ్యాణ్. దానికితోడు ప్రజారాజ్యంలో తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని నేరుగానే విమర్శించాడు పవర్ స్టార్. ఆ తర్వాత ఆయన సొంతంగా ఓ పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ సారి తనే సొంతంగా బరిలోకి దిగి దారుణంగా దెబ్బతిన్నాడు. కనీసం ఒక్క చోట కూడా గెలవలేక తల దించుకున్నాడు పవన్. కానీ గెలుపోటములు సాధారణం అని చాలా త్వరగా గ్రహించిన పవర్ స్టార్.. తర్వాత మళ్లీ జనంలోనే బిజీ అయిపోయాడు. దానికితోడు ప్రజారాజ్యం టైమ్ లో జరిగిన తప్పులన్నింటిని దృష్టిలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. పొరపాటున కూడా అవి తన పార్టీలో జరక్కూడదని ముందు నుంచి నిక్కచ్చిగా ఉంటున్నాడు.
ఇప్పుడు ఓడినా కూడా భవిష్యత్తులో మాత్రం తన ముద్ర వేస్తాడని చెబుతున్నారు విశ్లేషకులు. పవన్ ఆలోచన ధోరణిలో కొన్ని మార్పులు వస్తే కచ్చితంగా ఆయన ప్రభావం చూపిస్తాడంటున్నారు కొందరు. చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా మెరుగు అంటూ ఇప్పటికే అంతా మార్కులు వేసారు. దానికితోడు ఆయన మాటలు కూడా చాలా పదునుగా ఉంటాయి. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పవన్ మానసు మారలేదు. ఆయన కోసం కోట్లకు కోట్లు పట్టుకుని నిర్మాతలు ఎదురుచూస్తున్నా కూడా ఎవరికీ అంత త్వరగా పడటం లేదు పవన్. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో పింక్ సినిమాను రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు పవర్ స్టార్.
అయితే ఇప్పటి వరకు అది దిల్ రాజు చెప్పడమే కానీ పవన్ అయితే తన నోటి నుంచి చెప్పలేదు. కానీ త్వరలోనే ఈ చిత్ర రీమేక్ షూటింగ్ లో పాల్గొంటాడనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈయన కింగ్ ఆఫ్ సినిమా అయిపోయాడు. అయితే జనసేన అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వస్తే పవన్ కల్యాణ్ ను మునపటిలా చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సినిమాలు, రాజకీయాలు వేర్వేరు అని చిరంజీవి ఇప్పటికే నిరూపించాడు. ఈయన రీ ఎంట్రీలో నటించిన రెండు సినిమాలు బాగానే ఆడాయి. సైరా ఇతర భాషల్లో ఫ్లాప్ అయినా కూడా తెలుగులో మాత్రం విజయం సాధించింది. దాంతో ఇప్పుడు పవన్ కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు. మొత్తానికి గేమ్ ఛేంజర్ అనేది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయితే కచ్చితంగా అవుతాడంటున్నారు విశ్లేషకులు.