English   

ఒకప్పుడు టాలీవుడ్‌లో వెలిగి ఇప్పుడు మాయమైన హీరోలు వీళ్లే..

 Tollywood
2019-12-26 15:03:38

ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టమే. ఇక్కడ ఒక్కోసారి ఒక్కొక్కరి టైమ్ నడుస్తుంటుంది అంతే. అలాగే ఒకప్పుడు తెలుగులో టాప్ లేపేసిన కొందరు హీరోలు ఇప్పుడు మాయమయ్యారు. కనీసం వాళ్ల జాడ కూడా తెలియడం లేదు. అందులో కొందరు అసలు వాళ్లెక్కడున్నారో కూడా తెలియదు.. ప్రేక్షకులు కూడా వాళ్ల గురించి పూర్తిగా మరిచిపోయారు. మరి అలాంటి హీరోలెవరో ఒక్కసారి చూద్దాం..

1. తరుణ్

టాలీవుడ్‌లో ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్. అసలు లవర్ బాయ్ అనే పదానికి పర్ఫెక్ట్ నిదర్శనం ఈయనే. మిలినియం మొదట్లోనే నువ్వే కావాలి అంటూ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. బాలనటుడిగానే ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈయన హీరోగా కూడా రచ్చ చేసాడు. నువ్వే కావాలి తర్వాత ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వే నువ్వే లాంటి సినిమాలతో విజయాలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మెల్లగా ఫేడవుట్ అయిపోయాడు తరుణ్. ఇప్పటి తరానికి ఒకప్పుడు తరుణ్ అనే లవర్ బాయ్ ఉన్నాడనే సంగతే గుర్తులేదు.

2. వేణు

వేణు తొట్టెంపూడి.. 90ల చివర్లో స్వయంవరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు ఈ హీరో. తొలి సినిమాతోనే సంచలన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన నటించిన సినిమాలు చాలానే విజయాలు అందుకున్నాయి. అందులో కళ్యాణ రాముడు, హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అప్పట్లో క్రేజీ హీరోగా కొన్నేళ్ల పాటు వరస సినిమాలు చేసిన వేణు.. ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయాడు. ఆరేళ్ల కింద బోయపాటి తెరకెక్కించిన దమ్ము సినిమాలో ఎన్టీఆర్ బావ మరిదిగా నటించాడు. ఆ తర్వాత కనిపించలేదు వేణు.

3. వరుణ్ సందేశ్

చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుని.. ఇప్పుడు పూర్తిగా మాయమైపోయాడు వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాతో అప్పట్లో యూత్ ఐకాన్ అయిపోయాడు వరుణ్. కానీ ఆ తర్వాత కనీసం కనిపించలేదు. 20 సినిమాలు చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో బిగ్ బాస్ 3కి భార్యతో సహా వచ్చాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాత కూడా మనోడి జాతకం అయితే మారలేదు.

4. నవదీప్

తేజ స్కూల్ నుంచి వచ్చి కూడా ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు నవదీప్. చందమామ, గౌతమ్ SSC లాంటి సినిమాలు పర్లేదనిపించినా కూడా నవదీప్ మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే హీరోగా దాదాపు 15 సినిమాలకు పైగానే నటించాడు ఈయన. కొన్నేళ్ల కింది వరకు కూడా వరస సినిమాలు చేసినా ఆ తర్వాత మాత్రం మాయమైపోయాడు. ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్టుగా కాలం గడిపేస్తున్నాడు నవదీప్.

5. రాజ్ తరుణ్

ఉదయ్ కిరణ్ మాదిరే హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చాడు రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలతో విజయాలు అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ కుర్ర హీరో.. ఆ తర్వాత జోరు కొనసాగించలేకపోయాడు. వరస ఫ్లాపులతో తన కెరీర్ చేతులారా పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన సినిమాలు వస్తున్న సంగతి కూడా జనాలు పట్టించుకోవడం లేదు. తాజాగా విడుదలైన ఇద్దరి లోకం ఒకటే సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. రాజ్ తరుణ్ ప్రస్తుతం పూర్తిగా ఫేడవుట్ స్టేజీకి వచ్చేసాడు.

6. రోహిత్

6 టీన్స్ సినిమాతో 90ల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ గుర్తున్నాడా.. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసాడు ఈయన. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో చిరంజీవితో కూడా కలిసి నటించాడు. ఆ తర్వాత నేను సీతామాలక్ష్మి, రత్నం, గాళ్ ఫ్రెండ్, అనగనగా ఓ కుర్రాడు లాంటి సినిమాలు చేసాడు. ఫలితంతో సంబంధం లేకుండా కొన్నాళ్ల పాటు తెలుగులో వరస సినిమాలు చేసాడు రోహిత్. కానీ ఆ తర్వాత ఫ్లాపులతో వెనకబడిపోయాడు.. ఇప్పుడు బిజినెస్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు రోహిత్.

7. వడ్డే నవీన్

90ల్లో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోల్లో వడ్డే నవీన్ కూడా ఒకరు. తండ్రి వడ్డే రమేష్ నిర్మాత కావడంతో ఇండస్ట్రీకి ఎంట్రీ పాస్ ఈజీగానే దొరికింది. అయితే తండ్రి పేరు వాడుకున్నా కూడా తర్వాత మాత్రం వరస విజయాలతో దూసుకుపోయాడు నవీన్. కోరుకున్న ప్రియుడు, పెళ్లి, మనసిచ్చి చూడుతో పాటు ఇంకా ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాడు నవీన్. రవితేజ లాంటి స్టార్ హీరో కూడా ఒకప్పుడు ఈయన సినిమాల్లో అసిస్టెంట్‌గా నటించాడు. కానీ 2000 తర్వాత వడ్డే నవీన్ పూర్తిగా తెలుగు తెరకు దూరమవుతూ వచ్చాడు.

8. తనీష్

బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తనీష్.. రవిబాబు తెరకెక్కించిన నచ్చావులే సినిమాతో హీరో అయ్యాడు. రైడ్ సినిమాతో మరో హిట్ కూడా అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం కనిపించకుండా పోయాడు. చాలా సినిమాలు చేసినా కూడా తనీష్‌ను ఎవరూ పెద్దగా గుర్తు పెట్టుకోలేదు. దాంతో విలన్ పాత్రలు కూడా చేయడానికి రెడీ అయ్యాడు. అయినా కూడా కాలం కలిసిరాలేదు. బిగ్ బాస్ 2 తర్వాత అడపాదడపా షోలు చేసుకుంటున్నాడు తనీష్.

9. శివబాలాజీ

ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరో శివ బాలాజి. ఈ సినిమా తర్వాత దాదాపు 10 సినిమాలు హీరోగా నటించాడు ఈయన. కానీ విజయాలు మాత్రం రాలేదు. చందమామ మాత్రం పర్లేదనిపించింది. కానీ స్టార్ మాత్రం కాలేకపోయాడు శివ. దాంతో పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. బిగ్ బాస్ తొలి సీజన్ విన్నర్ అయిన తర్వాత కూడా ఈయనకు పెద్దగా కాలం కనికరించలేదు.

10. చక్రవర్తి

90ల్లో చక్రవర్తి ఓ సంచలనం. ఆయన సినిమాలు వచ్చాయంటే ఎగబడి చూసేవాళ్లు ప్రేక్షకులు. గులాబీ, ప్రేమకు వేళాయెరా, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా ఇలా చాలా సినిమాల్లో నటించాడు చక్రవర్తి. శివ సినిమాలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ తర్వాత హీరో అయిపోయి సంచలనం సృష్టించాడు. హిందీలో కూడా సత్య లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం అస్సలు కనిపించలేదు. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు ఒకప్పుడు తెలుగులో సంచలనాలు రేపిన హీరోలు ఇప్పుడు తెరమరుగున పడిపోయారు.

More Related Stories