English   

దర్బార్ సినిమా ఎలా ఉండబోతుంది.. రజనీకాంత్ హిట్ కొడతాడా..

Rajinikanth
2019-12-27 17:48:04

ఒకప్పుడు రజనీకాంత్ సినిమా వస్తుంది అంటే నెల రోజుల ముందు నుంచి సందడి కనిపించేది. కానీ కొన్నేళ్లుగా సూపర్ స్టార్ ప్రాభవం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. అందులో ముఖ్యంగా తను చేసే సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతుండటంతో రజనీకాంత్ సినిమాలపై తెలియకుండానే అంచనాలు తగ్గిపోతున్నాయి. నాలుగేళ్ల కిందట వచ్చిన కబాలి సినిమాపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ సినిమాలో విషయం లేకపోవడంతో దారుణంగా పరాజయం పాలైంది. దానికి ముందు వచ్చిన కొచ్చాడయాన్, లింగా సినిమాల పరిస్థితి కూడా ఇంతే. కబాలి తర్వాత ఎంతో నమ్మకంతో చేసిన కాలా సినిమా కూడా డిజాస్టర్ అయిపోయింది. 

ఇక ఈ ఏడాది విడుదలైన పేట సినిమా కూడా పెద్దగా అంచనాలు అనుకోలేదు. కుర్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ చిత్రం తమిళనాట యావరేజ్ గా ఆడినా తెలుగులో మాత్రం డిజాస్టర్ అయిపోయింది. సంక్రాంతి సినిమాల మధ్యలో పడి పేట కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు. ఈ సినిమాకు అప్పట్లో థియేటర్లు కూడా ఇవ్వలేరు. ఇలాంటి సమయంలో మరోసారి సంక్రాంతికి దర్బార్ సినిమాతో రాబోతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. 

అయితే ఈసారి మాత్రం మురుగుదాస్ తోడు తీసుకుని వస్తున్నాడు. సర్కార్ సినిమాతో సూపర్ ఫామ్ లోకి వచ్చిన మురుగదాస్.. రజినీకాంత్ తో తొలిసారి జోడి కట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికి తోడు రజనీకాంత్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించడం కూడా సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రజనీకాంత్ గత సినిమాలతో పోలిస్తే ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది అని నమ్ముతున్నారు అభిమానులు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా దర్బార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో ముంబై మాఫియాను ప్రధానంగా చూపించాడు మురుగదాస్. అక్కడి మాఫియాను కూకటివేళ్ళతో సహా ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా నాశనం చేశాడు అనేది దర్బార్ చిత్రకథ. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి కథలను ప్రేక్షకులు చూసిన కూడా మురుగదాస్ స్క్రీన్ ప్లే మాయాజాలంతో దర్బార్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు. అయితే ఎవరు ఏమనుకున్నా కూడా రజనీకాంత్ గత సినిమాలతో పోలిస్తే దర్బార్ పై అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి. బిజినెస్ కూడా అనుకున్న రీతిలో జరగడం లేదు. ఒకప్పుడు సినిమా అంటే దాదాపు 200 నుంచి 300 కోట్ల మధ్య బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం దర్బార్కు కేవలం 120 నుంచి 130 కోట్ల మధ్యలో దిగిన జరుగుతుందని తెలుస్తోంది. అది కూడా మురుగుదాస్ ఉన్నాడు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు నమ్ముతున్నారు. 

తెలుగులో అయితే దర్బార్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ కనీసం ఈ సినిమాకు 10 కోట్ల బిజినెస్ కూడా జరగడం లేదు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. ఇదే కానీ నిజం అయితే రజనీకాంత్ కు అంత కంటే దారుణమైన పరాభవం మరొకటి ఉండదు. కబాలి సినిమానే ఇక్కడ 30 కోట్ల బిజినెస్ చేసింది. ఇక 2.0 దాదాపు 75 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. అలాంటి రజనీకాంత్ సినిమా ఇప్పుడు కేవలం 10 కోట్లకు పడిపోవడం ఆయన అభిమానులకు అస్సలు ఊహకు కూడా అందడం లేదు. ఏదేమైనా కూడా ప్రస్తుతం దర్బార్ విజయం సాధిస్తే కానీ రజినీకాంత్ పునర్వైభవం లేని పరిస్థితి కనిపిస్తోంది. 

మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చూడాలి. పైగా సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో.. కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదలవుతున్నాయి. వీటి మధ్యలో థియేటర్లు దక్కించుకొని దర్బార్ సినిమా విజయం సాధిస్తే అంతకంటే అద్భుతం మరొకటి ఉండదు. 

More Related Stories