English   

మాలో ఏంటి రచ్చ..రాజశేఖర్ ఎందుకిలా చేస్తున్నాడు..

Rajasekhar
2020-01-02 15:11:41

మా అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత పది రోజులు కూడా గడవక ముందే అప్పట్లోనే చాలా రచ్చ జరిగింది. ప్రమాణ స్వీకారం చేసి కొన్ని గంటలకే మా అసోసియేషన్ లో ఉన్న గొడవలు బయటపడ్డాయి. ఒకరి మధ్య ఒకరికి అసలు సయోధ్య లేదని వాళ్ళ మాటలను.. వాళ్ళ తీరును బట్టి చూస్తుంటే అర్థమైపోయింది. అప్పట్లో నరేష్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన సమయంలో ఎన్నో విచిత్రాలు జరిగాయి. పైకి మాత్రం అంతా మాకు మేము.. మాలో మేము అంటూ నీతి సూక్తులు చెప్పే మా అసోసియేషన్ సభ్యులు.. లోలోపల మాత్రం మాటల యుద్ధం జరుపుకుంటున్నారని స్టేజీపై వాళ్ల మాటల్ని బట్టి అర్థమైపోతుంది. 

ముఖ్యంగా సీనియర్ నరేష్ మా అధ్యక్షుడు అయిన తర్వాత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఆయనపై మండి పడుతున్నారు మిగిలిన కార్యవర్గ సభ్యులు. అన్నింటికి మించి ప్రతిదానికి నేను నేను అనే పదం వాడుతున్నాడు అంటూ రాజశేఖర్ అందరి ముందు ఫైర్ అయ్యాడు. అందరం కలిసి చేసినప్పుడు మేము అనే పదం వాడితే బాగుంటుందని.. అంతే కానీ నేను ఒక్కడినే చేశానని చెప్పుకోవడం మాత్రం అన్యాయం అంటున్నాడు ఈ సీనియర్ హీరో. దీన్ని నరేష్ కవర్ చేయడానికి చూసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక వైస్ ప్రెసిడెంట్ హేమ మాట్లాడటానికి మైక్ తీసుకున్న తరుణంలో ఆమె నుంచి నరేష్ ఉన్నట్టుండి మైక్ లాగేసుకోవడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. 

ఇప్పుడు కూడా చిరంజీవి విషయంలో ఇదే జరిగింది. ఈయన మాట్లాడుతున్న సమయంలోనే చిరంజీవి చేతుల్లోంచి రాజశేఖర్ మైక్ తీసుకోవడమే తప్పు అయిపోయింది. అసలు అలా ఎలా చేస్తారు.. మాట్లాడుతున్నపుడు మైక్ ఎలా తీసుకుంటారంటూ సీరియస్ అయ్యాడు మెగాస్టార్. కోట శ్రీనివాసరావు దగ్గర్నుంచి కూడా అప్పట్లో నరేష్ ఇదే చేసాడు. ఈ విషయాన్ని అతడు చాలా సీరియస్ గా తీసుకొని మాట్లాడుతున్నప్పుడు మైక్ ఎలా లాక్కుంటారు అంటూ నరేష్ పై మండి పడ్డాడు కూడా. 

ఇక హేమ కూడా ఇదే చేసింది. మీ తీరు నాకు అస్సలు నచ్చడం లేదు అంటూ అందరి ముందు ఆయన్ని తప్పు పట్టింది. దానికి తోడు ప్యానల్ లో ఉన్న వాళ్ళని సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది కాదు అంటూ చెప్పింది హేమ. తాము కూడా గెలిచి ఈ స్టేజ్ కు వచ్చామని.. కాబట్టి అందరితో సంప్రదించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటూ నరేష్ ను కోరింది. అంతేకానీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదు అంటూ అందరి ముందు వార్నింగ్ ఇచ్చింది ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్. 

ఇవన్నీ చూసిన తర్వాత మా అసోసియేషన్ లో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఇప్పుడు అర్థమవుతుంది. శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఉన్నాయి కానీ వాళ్లు అప్పుడు బయట పడనీయలేదు. కానీ ఇప్పుడు నరేష్ వర్గం మాత్రం తమ మధ్య సయోధ్య లేదు అంటూ మీడియా ముందే బయట పడిపోయారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాను రాను ఎలా మారిపోతుందో చూడాలి.

More Related Stories