బాబోయ్ మహేష్ సినిమాకు కూడా మణిశర్మే అంట..

మొదలైంది.. మళ్లీ మొదలైంది.. మణిశర్మ మాయ మళ్లీ మొదలైంది.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి రచ్చ చేస్తున్నాడు మెలోడి బ్రహ్మ. అయినా మెలోడి బ్రహ్మ అని తెలుగులో ఈ పేరు ఒక్క మణిశర్మకు తప్ప మరే సంగీత దర్శకుడికి సరిపోదు. ఆయన మాత్రమే దీనికి అర్హుడు. ఇప్పుడు కాదు.. ఎప్పటికైనా మణిశర్మ పాటలంటే ఆల్ టైమ్ ఫేవరేట్ అంతే. కాకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా ఓ టైమ్ వరకే అన్నీ నడుస్తాయి. మణిశర్మ టైమ్ ఇప్పుడు లేదు. అందుకే కుర్రాళ్లకు వదిలేసి తను హాయిగా కొన్ని సినిమాలకు ఆర్ఆర్ ఇస్తున్నాడు.
ఒకప్పుడు ఈయన పనిచేయని హీరో లేడు.. దర్శకుడు లేడు. అప్పట్లో ఏ సినిమా చూసినా ఈయన పేరు కనబడాల్సిందే. పదేళ్ల కాలంలోనే 110కి పైగా సినిమాలకు సంగీతం అందించాడు మణిశర్మ. ఈ మధ్య దేవీ, థమన్ కు తోడు కుర్ర సంగీత దర్శకుల తాకిడి.. స్టార్ హీరోలు వీళ్ళకు పడిపోవడంతో మణిశర్మ కాస్త సైలెంట్ అయిపోయాడు. ఆ మధ్య నితిన్ లై సినిమాతో పాటు మరిన్ని సినిమాలకు పని చేసాడు ఈ సంగీత దర్శకుడు. 2018లో కూడా వరసగా సినిమాలు చేసాడు మణిశర్మ. ఎమ్మెల్యే సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలకు సంగీతం అందించాడు. ఇక ఈ ఏడాది విడుదలైన ఇస్మార్ట్ శంకర్ పాటలు మణిశర్మ లోని అసలైన మాస్ సంగీత దర్శకుడిని మళ్లీ బయటికి తీసుకొచ్చాయి.
ఇక గత రెండేళ్లుగా జెంటిల్ మన్.. లై.. ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు మణి. ఈ మధ్యే ఈయన చేతుల్లోకి భారీ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. అదే చిరంజీవి కొరటాల సినిమా. గతంలో చిరంజీవికి చాలా మ్యూజికల్ హిట్లు ఇచ్చాడు మణిశర్మ. అదే నమ్మకంతో ఇప్పుడు మరో అవకాశం ఇవ్వబోతున్నాడు మెగాస్టార్. ఈ సినిమాతో పాటు రామ్ రెడ్.. వెంకటేష్ అసురన్ రీమేక్ సినిమాలకు కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు మణిశర్మ.
ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లితో మహేష్ బాబు చేయబోయే సినిమాకు కూడా మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. గతంలో ఈ కాంబినేషన్ లో ఒక్కడు, అతడు, పోకిరి, ఖలేజా లాంటి చాలా సినిమాలు వచ్చాయి.