మా అధ్యక్షుడు నరేష్ పై శివాజీ రాజా ఫైర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో గొడవలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందులో ఎవరు ఎప్పుడు ఎవరిపై మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తారో అర్థం కాని పరిస్థితిలో పడిపోయింది మా అసోసియేషన్. చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలు కూడా ఈ గొడవలు చూసి సీరియస్ అయ్యారు అంటే సిచువేషన్ ఎంత దూరం వెళ్ళిపోయింది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మా ఉపాధ్యక్ష పదవి నుంచి రాజశేఖర్ తప్పుకున్న తర్వాత మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
'మా'కు నరేష్ లాంటి అధ్యక్షుడు ఉండటం దురదృష్టకరం అంటున్నాడు శివాజీ రాజా. ఈయన ప్యానల్ పైనే నరేష్ గెలుపొందాడు. ఇప్పుడు నరేష్ తీరును తప్పుబడుతూ చాలామంది మా సభ్యులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శివాజీ రాజా మాట్లాడుతూ మొన్న మా వేడుకలో జరిగిన వివాదం చాలా దురదృష్టకరమని తెలిపాడు. అందులోనూ ఇండస్ట్రీ పెద్దల ముందు సభ్యులు కొట్టుకున్నారు. ఇలా ప్రవర్తించడంపై వారే ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పాడు శివాజీ రాజా.
రాజశేఖర్ చాలా ఎమోషనల్‌గా ఉండే వ్యక్తి అని.. తనకు ఎన్నో ఏళ్లుగా అతనితో పరిచయం ఉందని.. అలాంటి వ్యక్తి ఎప్పుడూ తప్పు చేయడని తెలిపాడు శివాజీ రాజా. అంతే కాదు మా అసోసియేషన్ కోసం రాజశేఖర్ 10 లక్షలు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు. అలాంటి రాజశేఖర్ ఇప్పుడు అసోసియేషన్ లో తప్పులు జరుగుతున్నాయని చెప్పడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది.
అసలు అసోసియేషన్‌కు ఎన్ని నిధులు వస్తున్నాయో అధ్యక్షుడికి తెలియకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నాడు శివాజీ రాజా. అసోసియేషన్ కోసం చాలా మంది విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారని.. కానీ ఈ రోజు వారినే అవమానించారు అంటూ మా అధ్యక్షుడు నరేష్ పై మండిపడ్డారు శివాజీ రాజా. అలాంటి అధ్యక్షుడు ఉండటం 'మా' దురదృష్టం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈయన. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.