నమ్రత లేకపోతే తాను నేనంటున్న మహేష్ బాబు..

నిజమే.. మహేష్ బాబు జీవితంలోకి నమ్రత వచ్చిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు ఆయన ఉన్న తీరు వేరు.. ఒక్కసారి ఈమె జీవితంలోకి వచ్చిన తర్వాత మహేష్ మారిపోయిన తీరు వేరు. ముఖ్యంగా కెరీర్ విషయంలోనే కాకుండా సినిమాల విషయంలో కూడా మహేష్ బాబు ఎలా ఉండాలి.. ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలనే విషయంపై నమ్రత పూర్తి కంట్రోల్ తీసుకుంటుంది. యాడ్స్ లో కూడా మహేష్ ఈ స్థాయిలో దూసుకుపోడానికి కారణం కూడా భార్యే అంటాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు మరోసారి నమ్రత శిరోద్కర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు సూపర్ స్టార్. తన విషయంలో కానీ.. పిల్లల విషయంలో కానీ నమ్రత చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని చెబుతున్నాడు మహేష్ బాబు. అది కూడా తమ మంచికే అని.. పిల్లల్ని తాను బాగా గారాబం చేస్తానని.. అందుకే వాళ్లపై ఎలాంటి ప్రభావం పడకుండా తల్లి భయం చూపిస్తుందంటున్నాడు సూపర్ స్టార్.
తన కుటుంబం ఇంత అందంగా ఉంది కాబట్టే తనకు ప్రెజర్ అంటే ఏంటో తెలియదని.. ఇన్ని సినిమాలు కూడా హాయిగా చేసుకుంటున్నానని చెప్పాడు మహేష్. తనకు కంగారు కలిగించే ఏ విషయంలోనైనా భార్య, పిల్లలు తనను ప్రశాంతంగా ఉంచేలా చూసుకుంటారని చెప్పాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈయన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ తో బిజీగా ఉన్నాడు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలలో నటించారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 11న సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.