చిరు విజయశాంతి మళ్లీ కలిసి నటించబోతున్నారా..

చిరంజీవి-విజయశాంతి.. ఒకప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్ ఇది. దాదాపు 20 సినిమాల్లో కలిసి నటించారు ఈ జంట. వాటిలో మేజర్ పార్ట్ అన్నీ బ్లాక్ బస్టర్లే. రాధ, రాధిక తర్వాత చిరుతో ఆ స్థాయిలో సెట్టైన జోడీ విజయశాంతే. మెకానిల్ అల్లుడు తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ అవకాశం వస్తుందేమో అని చూస్తున్నారు అభిమానులు. దానికి సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక వేదికైంది.
ఈ వేడుకలో ఈ ఇద్దరూ మాట్లాడుకున్న తీరు అందరికీ ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా దర్శకులకు కొత్త ఊపిరి పోసింది. కచ్చితంగా మంచి పాత్ర ఉంటే చిరంజీవి సినిమాలో నటించడానికి విజయశాంతికి ఎలాంటి అభ్యంతరం లేదని తేలిపోయింది. మరోవైపు ఇప్పుడు మళ్లీ కలిసి నటిద్దామా అంటూ విజయశాంతి స్వయంగా చిరంజీవిని అడిగేయడంతో మళ్లీ కాంబినేషన్ వస్తుందేమో అని చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ వేడుకలో కూడా చిరు గురించి చాలా మాట్లాడింది ఈమె.
చిరంజీవే సూపర్ స్టార్ అంటూ మునగచెట్టెక్కించింది. ఇవన్నీ వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారనే దానికి సంకేతాలు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఆ కాంబినేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్కే. ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఈ సినిమాలో విజయశాంతికి ఏదైనా ముఖ్య పాత్ర ఇస్తాడేమో మెగాస్టార్ అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఆయనే సమాధానమివ్వాలి. ఏదేమైనా కూడా ఈ ఇద్దరూ కలిసి నటిస్తే మాత్రం రచ్చే.