English   

చిరంజీవి మారాడా.. మరో దాసరి అవుతున్నాడా..

 Chiranjeevi
2020-01-06 14:52:07

ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప‌రిస్థితులు చూస్తుంటే ఈ అనుమానం రావ‌డం కామ‌నే. ఎందుకంటే మొన్న జ‌రిగిన ఇండ‌స్ట్ర్రీ పెద్ద‌ల మీటింగ్ లో అధ్య‌క్షుడు చిరంజీవే. ఇంకా చెప్పాలంటే ఈ మీటింగ్ ఏర్పాటు చేసిందే మెగాస్టార్. ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల గురించి కూలంక‌శంగా మాట్లాడ‌టానికే చిరు ఇది ఏర్పాటు చేసాడు. ఒక‌ప్పుడు దాస‌రి ఇలా చేసేవారు. దాస‌రి అనే పేరులోనే పెద్ద‌రికం ఉంది. ఇండ‌స్ట్రీలో ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుగా అంతా త‌ట్టేత‌లుపు దాస‌రి నారాయ‌ణ‌రావు. అర్ధ‌రాత్రి వెళ్లి స‌మ‌స్య చెప్పినా.. దాన్ని ప‌రిష్క‌రించే వ‌ర‌కు దాస‌రి త‌పించేవారు. 

కానీ ఇప్పుడు ఆయ‌న లేరు. ఆయ‌న త‌ర్వాత ఇండ‌స్ట్రీలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. దాస‌రి త‌ర్వాత సురేష్ బాబు ఆ స్థానం కోసం పోటీ ప‌డ్డార‌నే ప్ర‌చారం జ‌రిగినా.. ఆయ‌న వైపు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు పెద్ద‌గా మొగ్గు చూప‌లేదు. దాంతో సురేష్ బాబు మ‌ధ్య‌లోనే ఆగిపోయారు. అల్లు అర‌వింద్ ఉన్నా త‌న విష‌యాల‌ను మాత్ర‌మే ప‌ట్టించుకుంటున్నారు.దాంతో దాస‌రి వ‌దిలివెళ్లిన పెద్ద‌మ‌నిషి కుర్చీ అలాగే ఉండిపోయింది. ఇండ‌స్ట్రీలో త‌ర్వాతి దాస‌రిగా మారిపోతున్నాడు చిరంజీవి. అవును.. ఇది న‌మ్మ‌డానికి కాస్త కొత్త‌గా అనిపిస్తున్నా ఇదే నిజం. పైగా తన మాటతీరులో కూడా మార్పు చూపిస్తున్నాడు మెగాస్టార్. 

తాజాగా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు చిరు పెద్దమనిషి తరహాలోనే వచ్చాడు. ఇక్కడ మాట్లాడుతూ అన్ని సినిమాలు ఆడాలి.. అందరూ బాగుండాలి అంటూ మాట్లాడేసాడు. అంటే చెప్పకనే తను ఇండస్ట్రీ పెద్దను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు అన్నయ్య. పైగా ఇండస్ట్రీ కూడా చిరుని పెద్ద‌దిక్కుగా భావిస్తున్నారు. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా మెగాస్టార్ ఇంటి త‌లుపు త‌డుతున్నారు. అలాగే చాలా మంది చిరంజీవితో మున‌ప‌టి వైరం మ‌రిచిపోయి మ‌రీ ఆయ‌న‌తో క‌లుపుగోలుగా ఉంటున్నారు. రాజ‌శేఖ‌ర్ దంప‌తులే దీనికి నిద‌ర్శ‌నం. తాజాగా విజయశాంతితో కూడా చిరు మాట కలిపిన తీరు అద్భుతమే.

అక్కడ తనను విజయశాంతి తిట్టిందని ఒప్పుకోడానికి కూడా ధైర్యం కావాలి. అలా అంతమంది ముందు తనను ఓ లేడీ తిట్టిందని చెప్పుకోడం చిన్న విషయం కాదు.. కానీ చిరంజీవి అది చేసాడు. అది కూడా ఓ రకంగా పెద్దరికమే. అలా చెప్పాలంటే కూడా పెద్దరికం కావాల్సిందే. ఇప్పుడు చిరు అది కూడా చేసాడు. దాసరి ఉన్నపుడు అన్నీ తాను చూసుకునేవాడు. కానీ ఆయన పోయిన తర్వాత అలా ఎవరూ పట్టించుకోని విధంగా మారిపోయింది ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు చిరు తానున్నానంటూ ముందుకొస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు తానే ముందుండి నడిపిస్తున్నాడు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ కూడా చిరు సారధ్యంలో నడవడానికి సై అంటున్నారు.

 మొన్న నాగార్జున కూడా తన అక్కినేని అవార్డ్స్ వేడుకకు చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిచాడు. తనకు ముఖ్యమంత్రులు అవసరం లేదు చిరంజీవి ఒక్కడే వస్తే చాలని చెప్పాడంటే చిరు స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. చిరంజీవి ఇక‌పై సినిమాల‌కే పూర్తి స‌మ‌యం కేటాయించ‌బోతున్నారు. అంటే ముందులా ఆయ‌న‌కు ఇప్పుడు రాజ‌కీయాలు కూడా లేవు. దాంతో అంద‌రి స‌మస్య‌లు తీర్చే పెద్దదిక్కుగా మార‌డానికి కావాల్సినంత టైమ్ కూడా ఉంది. అయితే దాస‌రి ప్లేస్ లోకి చిరు వ‌స్తార‌ని భావిస్తున్నా.. చిన్న సినిమాల‌కు ఆయ‌నిచ్చే భ‌రోసా ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది. 

ఈ మధ్య ప్రతీ సినిమా వేడుకలో కూడా చిరు కనిపిస్తున్నాడు. చిన్న సినిమాలకు కూడా ఆయన బాసటగా నిలుస్తున్నారు. ఇక స్టార్ హీరోలకు కూడా అండగా ఉంటున్నాడు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చిన్న సినిమాల ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. థియేట‌ర్స్ కూడా దొర‌క్క నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు చిన్న నిర్మాత‌లు. వాళ్ల‌కు ఎప్పుడూ త‌న వంతు సాయం చేస్తుండేవారు దాస‌రి నారాయ‌ణ‌రావు. అస‌లు ఇండ‌స్ట్రీలో ఈ రోజు చిన్న సినిమాల‌కు కొద్దో గొప్పో మంచి రోజులు ఉన్నాయంటే దానికి కార‌ణం దాస‌రి అని చెప్ప‌క త‌ప్ప‌దు. 

ఇండ‌స్ట్రీలో ఎక్క‌డ మంచి సినిమా వ‌చ్చినా.. చిన్న సినిమాల‌కు అన్యాయం జ‌రిగిందని తెలిసినా వెంట‌నే అక్క‌డికి వెళ్లి త‌న గ‌ళం విప్పేవారు దాస‌రి. చిన్న సినిమాల‌కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవాడు ఈయ‌న‌. ఇప్పుడు పెద్ద హీరోలుగా చ‌లామణి అవుతున్న వాళ్లంతా ఒక‌ప్పుడు చిన్న సినిమాల నుంచే పైకి వ‌చ్చిన వాళ్ల‌ని.. చిన్న సినిమాల‌ను తీసిపారేస్తే ఇండ‌స్ట్రీ బ‌త‌క‌ద‌ని చెప్పేవారు దాస‌రి నార‌య‌ణ‌రావు. చిన్న సినిమాలు బ‌తికితేనే పెద్ద సినిమాలు ఉండేవి.. లేదంటే అవి లేక‌పోతే ఇవి కూడా లేవు.. అని చెప్పేవాళ్లు ద‌ర్శ‌క‌ర‌త్న‌. మ‌రిప్పుడు చిన్న సినిమాల‌కు కొండంత అండ‌గా ఉండే దాస‌రి అస్త‌మించారు. ఇప్పుడు చిన్నోళ్ల‌కు అండ‌గా ఎవ‌రు ఉంటారో చూడాలి..! నిజంగా చిరు అది కూడా చేసి చూపిస్తే ఇక ఆయ‌న‌కు తిరుగుండ‌దు.

More Related Stories