గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో స్పెషల్ అట్రాక్షన్ గా ప్రియాంక చోప్రా కపుల్

77వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగింది. ఉత్తమచిత్రంగా ఎంపికైన 1917 పలువిభాగాల్లోనూ అవార్డులను కొల్లగొట్టింది. దీనితో పాటు జోకర్ సినిమా కూడా అవార్డుల రేసులో సత్తా చాటింది. హాలీవుడ్ లో కలెక్షన్లతో దుమ్మురేపిన పలుచిత్రాలు...వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి. ప్రధానంగా హాలీవుడ్ హీరోలు జాక్విన్ ఫీనిక్స్, క్రిస్టియన్ బాలే, ఆంటోనియో బాండెరాస్, అడమ్ డ్రైవర్, జోనాథన్ ప్రైస్, హీరోయిన్లు.. రెనీ జెల్వెగర, సింథియా ఎరివో, స్కార్లెట్ జోహన్సన్, సోయిర్స్ రోనన్, చార్లిజ్ థెరాన్ సహా పలువురు స్టార్లు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. భర్త నిక్ జోనస్ ఈ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
హాలీవుడ్, టెలివిజన్, ఫిల్మ్ అండ్ డిజిటల్ విభాగాలలో అందిస్తున్న ఈ ఫంక్షన్లో మ్యూజికల్ అండ్ కామెడీ విభాగంలో ఉత్తమ చిత్రంగా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ చిత్రం నిలిచింది. ఈ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్ పిట్ నిలిచారు. ఇదే సినిమాకు గానూ ఉత్తమ స్క్రీన్ ప్లే అందించినందుకు క్వింటెన్ టారంటినో అవార్డు అందుకున్నారు. టోటల్ గా మూడు విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ చిత్రం డ్రామా విభాగంలో 1917 అవార్డు దక్కించుంది. 1917, ఐరిష్, జోకర్, మ్యారేజ్ స్టోరీ, ది టూ పోప్స్ చిత్రాలు పోటీ పడగా 1917 చిత్రానికి అవార్డు దక్కింది. ఈ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా సామ్ మెండిస్ అవార్డు సాధించారు. ఈచిత్ర యూనిట్ మొత్తంగా రెండు అవార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు.
ఉత్తమ నటుడిగా జోకర్ సినిమాకు గానూ జాక్విన్ ఫీనిక్స్ కు అవార్డు లభించింది. జోకర్ చిత్రానికి గానూ జాక్విన్ ఫీనిక్స్, ఫోర్డ్ వి ఫెరారీచిత్రానికి గానూ క్రిస్టియన్ బాలే, పెయిన్ అండ్ గ్లోరీ సినిమాకు గానూ ఆంటోనియో బాండెరాస్, మ్యారేజ్ స్టోరీకి గానూ అడమ్ డ్రైవర్, దిటూపోప్స్ చిత్రానికి గాను జోనాథన్ ప్రైస్ పోటీ పడగా.. అత్యుత్తమనటనకు గానూ ఫీనిక్స్ అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌కు గానూ జోకర్ సినిమాకు హిల్దుర్ అవార్డు దక్కించుకున్నారు. మొత్తంగా రెండు అవార్డులు .. ఈసినిమాకు దక్కాయి. రాకెట్ మెన్ చిత్రానికి గానూ ఉత్తమనటుడిగా టారోన్ ఎగర్టన్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో రాకెట్ మ్యాన్ చిత్రానికి గానూ ఐయామ్ గొన్న లవ్ మి ఎగైన్ సాంగ్‌కు అవార్డు దక్కింది. ఉత్తమనటిగా ది ఫేర్వెల్ చిత్రానికి గానూ ఆక్వాఫిన, ఉత్తమ సహాయనటి విభాగంలో మ్యారేజ్ స్టోరీ సినిమాకు గానూ లారా డెర్న్ అవార్డు అందుకున్నారు.ఉత్తమ విదేశి భాషా సినిమాగా పారాసైట్ నిలిచింది.