దర్శకుడు జయంత్ సి పరాన్జీకి పితృవియోగం..

పవన్ కల్యాణ్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు జయంత్ సి పరాన్జీకి పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి డాక్టర్ పీటీ చంద్రమౌళి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న చంద్రమౌళి.. స్వగృహంలోనే మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో జయంత్ దర్శకుడు అయ్యాడు.
ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన చంద్రమౌళి చివరి వరకు ప్రజా సేవలోనే ఉన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థలో సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందరు చంద్రమౌళి. చిత్తూరు జిల్లాలో సాధారణ కుటుంబంలో జన్మించిన డా. చంద్రమౌళి స్వయంకృషితో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు సమాజంలో. ఆయన వైద్యుల జాతీయ సంస్థకు రెండు పర్యాయాలు అఖిల భారత అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. చంద్రమౌళి భౌతికకాయానికి జనవరి 8న మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి. చంద్రమౌళి మృతి పట్ల తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.