English   

సుకుమార్ కోసం లుక్ మారుస్తున్న అల్లు అర్జున్..

Allu Arjun
2020-01-08 17:18:54

అల్లు అర్జున్ అంటేనే స్టైలిష్ స్టార్. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు ఈయన. కథలు ఎలా ఉన్నా కూడా లుక్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతుంటాడు అల్లు వారబ్బాయి. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు. ప్రస్తుతం అల వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. సంక్రాంతి తర్వాత సుకుమార్ సినిమాతో బిజీ కానున్నాడు. 

సింహాచలం అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ రాసుకున్నాడు సుకుమార్. ఇందులో పాత్ర కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెడ్డం పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా గడ్డం పెంచుతున్నాడు అల్లు అర్జున్. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కూడా గడ్డం తోనే కనిపించాడు. ఇప్పుడు కూడా తన హీరోని మరోసారి గడ్డంతో చూపించబోతున్నాడు సుకుమార్. 

ఇంతకు ముందు ఎన్టీఆర్, రామ్ లాంటి హీరోలతో కూడా గడ్డం పెంచమని చెప్పాడు ఈ దర్శకుడు. ఇప్పుడు బన్నీ తో కూడా ఇదే చేస్తున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం చిత్తూరు కుర్రాడిగా ఇందులో కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. కాస్ట్యూమ్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అన్నింటికీ మించి బన్నీ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

More Related Stories