జాను సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..అందుకే ప్రమోషన్స్ కూడా

శర్వానంద్, సమంత జంటగా తమిళ హిట్ ’96’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో ‘జాను’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది సినిమా యూనిట్. అంతేకాదు నిన్ననే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఎడారిలో ఒంటెలను తాడుతో లాగుతూ శర్వానంద్ కనిపించారు. ‘షరతులు, నియమాలు, హద్దులు లేని ప్రేమకు అసలైన నివాళి’ అంటూ ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ అభిమానులతో పంచుకుంది.
తమిళ మాతృకను తెరకెక్కించిన సి. ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా 96 పేరుతో వచ్చిన ఆ సినిమా అక్కడి ప్రేక్షకుల్నీ విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబట్టింది. హృదయాలను తాకే సన్నివేశాలతో.. దానికి తగ్గట్లుగా నేపథ్య సంగీతం కూడా అమరడంతో ఆ సినిమా అక్కడి ప్రేక్షుకులకి బాగా నచ్చింది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న జాను, పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. దీంతో సినిమా విడుదల తేదీని అనధికారికంగా ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు.
ఈ జాను సినిమాను 2020 ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. నిజానికి ఇది ప్రేమకి సంబందించిన సినిమా కాబట్టి ప్రేమికుల దినోత్సవం రోజున రిలీజ్ చేయాలని భావించారు. కానీ అదే రోజున విజయ్ దేవరకొండ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ కి రెడీ అయిన కారణంగా ఒక వారం ముందుగానే రావడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలివడాల్సి ఉంది. అందుకే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ‘జాను’ టీమ్ ఇప్పుడు వరుస పెట్టి అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది.
నిన్ననే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ను కూడా ఫిక్స్ చేసింది. జనవరి 9 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుందనే చెప్పాలి.