సీఏఏ గురించి నోరెత్తని టాలీవుడ్...అందుకేనా...

దేశమంతా సీఏఏకు వ్యతిరేకంగా ఏక స్వరమై చెవులు చిల్లులు పడేలా నినదిస్తోంది. కానీ వాళ్లు మాత్రం వినిపించనట్టే ఉండిపోతున్నారు..కొందరు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు..ఇంకొందరు మనకు సంబంధం లేదులే అనుకుంటున్నారు. బాలీవుడ్ లో కొందరు తప్ప ప్రజల్లో తామూ భాగమే అనుకునే స్టార్లు కనిపించటం లేదు. ఈ విషయంలో టాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పౌరసత్వ సవరణ చట్టానికి దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల నుండి దక్షిణాది వరకు ఏకమై సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నారు. యూనివర్సిటీలు ఆందోళలను విరమించేది లేదంటున్నాయి. జామియా మిలియా, ఆలీఘడ్, జె ఎన్ యూ ల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల వరకు నిరసనలకు నుంచి వెనక్కు తగ్గటం లేదు. ఆఖరికి పెద్దగా రాజకీయాలు పట్టించుకోని ఐఐటిలు కూడా సీఏఏకు వ్యతిరేకంగా గొంతెత్తాయి.
దేశవ్యాప్తంగా విద్యార్థిలోకం నుంచి సాధారణ ప్రజానీకం వరకు నిరసనలను హోరెత్తిస్తున్న దృశ్యం ఇప్పుడు కనిపిస్తోంది. పౌరసత్వ సవరణలో మత ప్రాతిపదికను వ్యతిరేకిస్తున్నారు. ఎన్నార్సీని ఒప్పుకునేది లేదంటున్నారు. ఈ తరుణంలో సెలబ్రిటీలెక్కడున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కోట్లాది ప్రజలు నెలరోజులుగా అవిశ్రాంతంగా ఆందోళన చేస్తుంటే, కాళ్ల కింది భూమి కదులుతోందని భయపడుతుంటే, కొందరు బాలీవుడ్ నటీనటులు మాత్రమే దీనిపై స్పందిస్తున్నారు. బాలీవుడ్ నటి దీపిక పదుకునే జెఎన్ యూ క్యాంపస్ కి వెళ్లటం, నిరసనలు జరుగుతున్న సబర్మతి హాస్టల్ దగ్గర విద్యార్థులకు సంఘీభావంగా నిలబడటం ఒక ఊరటలాంటిదనే భావన వ్యక్తమయింది. పౌరసత్వ ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం లేదు. ఓ సెలబ్రిటీ నుంచి కనీసం ఒక స్టేట్ మెంట్, ఒక ట్వీట్ చాలు ఆందోళనలో ఉన్నవారికి అంతులేని మనో ధైర్యాన్నిస్తుంది.
దేశమంతా రెండుగా చీలిన సందర్భంలో ఎటున్నామని స్పష్టం చేసుకోవటమూ ఎవరికి వారికి అవసరమే. ఇప్పుడు దీపిక పదుకునే నిరసన తెలుపుతున్నవారితో కలిసి నిలబడ్డారు. దాడిలో గాయపడిన విద్యార్థి నాయకురాలు ఐషీ ఘోష్ ను కలిసి, మాట్లాడారు, కానీ ఆమె జె ఎన్ యూ క్యాంపస్ కి రావటంపై సినిమా ప్రమోషన్ కోసమే అని విమర్శించేవారు లేకపోలేదు. కానీ, సినిమా రిలీజ్ కు ముందు అక్కడకు వచ్చి అదనంగా వ్యతిరేకతను తెచ్చుకోవలసిన అవసరం ఆమెకు లేదని, సైలెంట్ గా ఉంటేనే లాభం ఎక్కువనే విషయాన్ని ఆమెను వ్యతిరేకిస్తున్న వారు మర్చిపోతున్నారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి, దీపికా చపాక్ సినిమా ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.