English   

ఎంత మంచివాడవురా రివ్యూ

Entha Manchi Vadaviraa Review.jpg
2020-01-15 14:05:28

తెలుగులో సరయిన హిట్ కోసం తహతహలాడుతున్న హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. అప్పుడెప్పుడో అతనొక్కడే సినిమాతో హిట్ కొట్టిన ఆయన ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ లేదు.  గత ఏడాది వైవిధ్యబరితమైన 118 సినిమాతో మనముందుకు రాగా ఇప్పుడు ఎంత మంచి వాడవురా సినిమాతో మనముందుకు వచ్చారు. ఈ సంక్రాంతికి విడుదల కాబడిన ప్రతీ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో సరిగా సంక్రాంతి రోజునే మనముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూడాలంటే రివ్యూ చదవాల్సిందే.
కధ :
ఇంకా పసితనం కూడా పోక ముందే తల్లితండ్రులని కోల్పోయిన బాలు(కల్యాణ్ రామ్)ని చుట్టాలందరూ వదిలేస్తారు. ఎందుకంటే ఎవరు దగ్గరకు తీసినా వారికి అనవసర ఖర్చు అనుకుని తప్పుకుంటారు. అయితే తన తండ్రి స్నేహితుడు నరేష్ బాలుని పెంచి పెద్ద చేస్తాడు. అయితే చిన్నతనం నుండే నరేష్ చిన్న కూతురు (నందిని) బాలుని ప్రేమిస్తూ ఉంటుంది. పెరిగి పెద్దయ్యాక నందిని షార్ట్ ఫిల్మ్ లు ప్రొడ్యూస్ చేస్తే వాటిలో హీరోగా నటిస్తూ ఉంటాడు బాలు. అయితే తనను నందిని ప్రేమిస్తుందని తెలిసినా ఆమె ప్రేమను ఒప్పుకోడు. అయితే తన జీవితంలో చూసిన కొన్ని పరిస్థితులను చూసిన బాలు ఒక బిజినెస్ ప్లాన్ చేస్తాడు. ఆ బిజినెస్ లో నందిని అండ్ టీం కూడా భాగస్వాములు అవుతారు. అయితే బాలు చూసిన ఆ పరిస్థితులు ఏమిటి ? బాలు మొదలు పెట్టె బిజినెస్ ఏమిటి ? ఆ బిజినెస్ వలన బాలు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి ? చివరికి నందిని ప్రేమను బాలు ఒప్పుకున్నాడా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
ఈ సంక్రాంతి 2020కి మాదే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిగతా సినిమాలతో అసలు మాకు పోటీనే లేదు అంటూ వచ్చింది ఈ సినిమా. కానీ సినిమా అనుకున్నంత స్థాయిలో లేదనే చెప్పాలి. శతమానం భవతి సినిమా స్థాయిలో అదే విధంగా ఉంటుందని భావించగా ఈ సినిమా శ్రీనివాస కళ్యాణం లాగే సాగదీసిన ఎమోషన్స్ తో తెరకెక్కించారు దర్శకుడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక డైలీ సీరియల్ ని సాగతీసినట్టు సాగ తీశారు అనిపించింది. చాలా అంచనాలతో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు ఈ సినిమా చూశాక ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా కొందరికి కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పలేం.

నటీనటులు :
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇందులో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. నటన, డైలాగ్స్ డ్యాన్స్ పరంగా డైరెక్టర్ అడిగిన పాత్రకి వంద శాతం న్యాయం చేసినట్టే ఉన్నాడు. మెహ్రీన్ కౌర్ కూడా కళ్యాణ్ తో సినిమా మొత్తం ఉంటుంది కానీ ఎప్పటిలానే చేశాను అంటే చేశాను అన్నట్టు చేసుకుంటూ పోయింది. సినిమా మొత్తం ఎమోషన్స్ చుట్టూనే తిరిగుతుంటే ఆమె మాత్రం ఆ సీన్స్ లోనే ముఖం తెలేసేసింది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది. అందరూ దాదాపు తమకి ఇచ్చిన పాత్రలను బాగానే పండించారు. ప్రతినాయకుడిగా రాజీవ్ కనకాల కనిపించేది తక్కువ సేపే అయిన బాగా చేశాడు. వెన్నెల కిషోర్ ఉన్నంత సేపు కామెడీ బాగుంది. ఆయన-అప్పాజీ మధ్య వచ్చే 5 నిముషాల ట్రాక్ కాస్త నవ్వించింది. మిగిలిన పాత్రల్లో నటించిన తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, శరత్ కుమార్, సుహాసినిలు తమ పాత్రల్లో ఓకే అనిపించారు. అందరివీ చిన్న చిన్న పాత్రలే.
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాని ముందే ఒక సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేస్తున్నట్టు చెప్పారు. అయితే లైన్ అయితే మంచిదే కానీ అనవసరమైన సీన్స్, ఎక్కువమంది పాత్రధారులతో సినిమా మొత్తాన్ని గజిబిజి లేపారు. చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే అయినా దానిని తెరకెక్కించే విధానం మిస్ అయిందని చెప్పొచ్చు. కథనం చాలా స్లోగా ఉండడం వలన సీరియల్ అనిపిస్తుంది. ఇదే స్క్రీన్ ప్లేని మార్చి తీసి ఉండి ఉంటే బాగుండేదేమో ? ఒక్కొక్క సీన్ ప్రకారం చూస్తే ఎటువంటి వంకా పెట్టలేము కానీ అన్నీ కలిపి చూసినప్పుడు మాత్రం బోర్ కొట్టక తప్పదు. గోపి సుందర్ మ్యూజిక్ పర్లేదు. ఇక రాజ్ తోట విజువల్స్ గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు. గోదావరి జిల్లాల అందాలను కళ్ళకు కట్టినట్టు చూపారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాహున్నాయి. నిర్మాతలుగా మొదటిసారి రంగంలోకి దిగిన ఆదిత్య మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సంక్రాంతికి వచ్చిన ముందు రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా ఎంత మంచివాడవురా మూవీ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
ఫైనల్ గా :
అనుకున్నట్టే ఎమోషనల్ టచ్ వర్కౌట్ అయ్యుంటే ఈ సంక్రాంతి సినిమా హిట్ అయ్యుండేది.

More Related Stories