తమ్ముడు అని పిలవను...ఎందుకంటే

మన తెలుగులో ఉన్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఫ్యామిలీ సపోర్ట్ అందుకోలేక పోయిన ఆయన తదనంతర కాలంలో పెళ్లి తర్వాత ఫ్యామిలీతో కలిసి పోయారు. అయితే ఫ్యామిలీతో కలిసే కంటే ముందే ఆయనకు అన్న కళ్యాణ్ రామ్ కి మంచి రాపో ఉండేది. అయితే దురదృష్టం అనుకోవాలో లేక అదృష్టం అనుకోవాలో వారి కుటుంబంలో చోటు చేసుకున్న మరణాల వలన వారి మధ్య బంధం ఇంకా బలపడుతూ వెళ్ళింది. అయితే తమ మధ్య ఉన్న బంధం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తారక్ అన్న కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన నటించిన ఎంత మంచి వాడవురా సినిమా రిలీజ్ కి సిద్దమయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ తమ బంధం అన్నదమ్ముల కంటే ఎక్కువ అని అందుకే తారక్ ను తమ్ముడు అని పిలవనని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. "ఎన్టీఆర్ నన్ను అన్న అని పిలుస్తాడు. కానీ నేను ఎన్టీఆర్ ను తమ్ముడు అని పిలవను. నాన్న అని పిలుస్తాను. నాన్నను తారక్ లో చూసుకుంటాను, నాన్న లేని లోటును తమ్ముడు తీరుస్తున్నాడు. నాన్నలోని ఎన్నో లక్షణాలు తమ్ముడిలో ఉన్నాయి." అంటూ ఆయన కాస్త ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సమయంలో తారక్ తో మల్టీస్టారర్ చేసే అంశం మీద కూడా పెద్ద తరహాలో స్పందించాడు. మీరు ఆయన కలిసి సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని అడగగా తారక్ కు తనకు మధ్య మంచి అనుబంధం అందని, దాన్ని కమర్షియల్ చేయలేనని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశాడు. అయితే ఒకవేళ ఇద్దరూ నటించేలా మంచి కథ దొరికితే అప్పుడు ఆలోచిస్తామని కావలని చేయడం అయితే ఉండదని ఆయన కుండ బద్దలు కొట్టేశాడు ఈ నందమూరి హీరో.