English   

సంక్రాంతి అంటే ఇలా ఉండాలి.. బాక్సాఫీస్ కి ఇద్దరు మొగుళ్ళు..

Allu Arjun mahesh
2020-01-18 13:09:30

ఈ సంక్రాంతి సినిమాలపై ముందు నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా, రజనీకాంత్ దర్బార్ సినిమాలపై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. హీరోల సినిమాలు వచ్చినా కూడా ఒకవేళ హిట్టయితే బోనస్ అనుకున్నారు. కానీ ఆ బోనస్ ఎలాగూ రాలేదు. తొలిరోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఎంత మంచి వాడవురా ఫ్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. మరోవైపు మంచి టాక్ వచ్చినా కూడా రజనీకాంత్ దర్బార్ సినిమా నిలబడలేక పోయింది. 

ముందు నుంచి కూడా అందరి అంచనాలు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాల పైనే ఉన్నాయి. ఈ రెండు అంచనాలకు తగ్గట్టుగా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. విడుదలైన వారం రోజుల తర్వాత కూడా సంక్రాంతి హాలిడేస్ పక్కాగా వాడుకుంటూ కమర్షియల్గా తెలుగు సినిమా సత్తా చూపిస్తున్నాయి ఈ రెండు సినిమాలు. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ కలిసి దాదాపు 300 కోట్ల గ్రాస్ వసూలు చేశారు. 

ఇందులో అల వైకుంఠపురంలో ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ కావడంతో 2020లో తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రతి రోజూ పండగ చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర జనాలు జాతరకు వచ్చినట్లు రావడంతో నిర్మాతల జేబులో కోట్లకు కోట్లు పడుతున్నాయి. ఇక మహేష్ బాబు కూడా కమర్షియల్ సినిమా సత్తా చూపిస్తున్నాడు. రొటీన్ స్టొరీ, రొటీన్ ఫార్ములా అంటూ విశ్లేషకులు పెదవి విరిచినా రొటీన్ మాస్ సినిమాకు ఉండే సత్తా చూపిస్తూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు సూపర్ స్టార్. 

ఇప్పటికే వారం రోజుల్లో దాదాపు 90 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది సరిలేరు నీకెవ్వరు. ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో మహర్షి సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది. కానీ ఇప్పుడు దాన్ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా బి, సి సెంటర్లలో మంచి వసూళ్లు తీసుకొస్తుంది. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు.. ఈసారి మొగుడొస్తాడు అంటూ అనిల్ రావిపూడి రాసిన డైలాగ్ కలెక్షన్లలోనూ నిజమైంది. 

మరోవైపు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో దూకుడు మరో స్థాయిలో ఉంది. ఇంటా బయట ఈ సినిమా ఓ రేంజ్ లో కమ్మేస్తుంది. కేవలం ఐదు రోజుల్లోనే 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అన్ని ఏరియాల్లోనూ సేఫ్ జోన్ కి దగ్గరగా వచ్చేసింది. ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది అల వైకుంఠపురంలో. ఎటు చూసుకున్న కూడా ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ క్లియర్ విన్నర్ అయిపోయాడు. మహేష్ బాబు కూడా మంచి వసూళ్లు సాధించి సంక్రాంతికి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. 

అందుకే ఈ సంక్రాంతి ఇద్దరు మొగుళ్ళు వచ్చారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా బాక్సాఫీస్ వారం రోజులకు పైగా కలకలలాడుతూ కనిపిస్తుంది. థియేటర్స్ అన్నీ జనాలతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. మరి సంక్రాంతి ఇచ్చిన ఆరంభం మిగిలిన సినిమాలు కొనసాగిస్తాయో లేదో చూడాలి.

More Related Stories