English   

తమన్ దూకుడు.. దేవీ పని అయిపోయినట్లేనా..

Thaman
2020-01-21 12:57:13

100 సినిమాలకు పైగా మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడికి ఒక్క సినిమాతో ఫేట్ మారిపోతుందా.. ఒకేఒక్క సినిమా అందలం ఎక్కిస్తుందా..? ఏమో ఇప్పుడు తమన్ ను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఇన్నేళ్లుగా ఎన్ని సినిమాలకు సంగీతం అందించినా కూడా ఈయనకు కాపీ క్యాట్.. రొటీన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరుండేది. అందుకే ఎన్ని సినిమాలు చేసినా కూడా నెంబర్ వన్ కాలేకపోయాడు. పైగా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.. ఇన్నాళ్లు ఈ ప్రశ్నకు సమాధానం దేవి శ్రీ ప్రసాద్ అని వచ్చేది. 

కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ డిఎస్పి జోరు తగ్గించాడు. దాంతో ఇదే అదునుగా దూసుకుపోతున్నాడు తమన్. ముఖ్యంగా అల వైకుంఠపురములో విడుదల తర్వాత తమన్ రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమాకు తొలి విజయం చేకూరేలా చేసింది తమనే. ఎందుకు మీరు టికెట్ కొనరు అంటూ ప్రశ్నించేలా తన సినిమాకు సంగీతం అందించిన తమన్ కు చేతులెత్తి నమస్కరించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 

గత మూడేళ్లుగా మహానుభావుడు, తొలిప్రేమ, ఛల్‌ మోహన్‌రంగ, అరవింద సమేత వీర రాఘవ సినిమాలు తనకు మంచి పేరు తీసుకొచ్చాయని చెప్పుకొచ్చాడు సంగీత దర్శకుడు తమన్‌.  సరైనోడు తర్వాత ఏడాది విరామం తీసుకున్నానని.. ఆది తనకెంతగానో ఉపయోగపడిందని చెబుతున్నాడు ఈయన. ఆ సమయంలోనే ఇలాంటి సినిమాలు ఒప్పుకోవాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు తమన్. 

ఇక గత రెండు నెలలుగా ఏ సినిమా పోస్టర్ పై చూసినా కూడా ఈయన పేరు కనిపిస్తుంది. వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, అల వైకుంఠపురములో సినిమాలతో మరోసారి తన సత్తా చూపించాడు ఈయన. వీటితో పాటు తమన్ చేతిలో మరో అరడజను ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నాడు. తన జోరు చూస్తుంటే ఏడాదికి 15 సినిమాలకు సంగీతం అందించేలా కనిపిస్తున్నాడు. 

ఇక తన కెరీర్లో రీమిక్స్‌ సాంగ్స్‌ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు తమన్. నాయక్‌లో 'శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో...'..  ఇంటిలిజెంట్‌లో 'ఛమక్‌ ఛమక్‌ ఛామ్‌'తో పాటు తమన్‌ కొన్ని రీమిక్స్‌ చేశారు. అయితే ఒకసారి ఒక రీమిక్స్ సాంగ్ విషయంలో సీనియర్ లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు తనకు ఫోన్ చేసి తిట్టారని..  అప్పట్నుంచి రీమిక్స్ సాంగ్స్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

తనకు 60 ఏళ్లు వచ్చాక... తన పాటలను ఎవరైనా రీమిక్స్‌ చేస్తే అప్పుడు తాను కూడా నా పాటలు పాడు చేసాడు అంటూ తిట్టుకుంటానని అందుకే ఇప్పుడు రీమిక్స్ పాటలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు తమన్. మొత్తానికి దేవీ దూకుడు తగ్గించడంతో ఇదే అదునుగా దూకుడు చూపిస్తున్నాడు తమన్. 
 

More Related Stories