English   

దీపిక డిప్రెషన్ ని మాత్రమే కాదు...హృదయాలని గెలిచింది

deepika
2020-01-22 04:59:45

నటి దీపికా పడుకొనే ప్రతిష్టాత్మక క్రిస్టల్ అవార్డు అందుకుంది. డిప్రెషన్ మీద చేసిన పోరాటానికి గాను దావోస్‌లోని వరల్డ్ అకాడమిక్ సమ్మిట్ లో ఈ అవార్డు తీసుకున్నారు. పోరాటంతోనే డిప్రెషన్‌పై గెలవడం సాధ్యమన్న ఆమె తన జీవితంలో ఎదురైన అనేక సమస్యలను పంచుకున్నారు. డిప్రెషన్, ఆందోళన ప్రపంపంలో అత్యధికులను వేధిస్తున్న సమస్యలివి. కొందరు భయపడి ప్రాణాలు తీసుకుంటుంటే మరికొందరు ధైర్యంగా ఎదుర్కొంటూ విజేతలుగా నిలుస్తున్నారు. గెలుపు సాధించడమే కాదు మానసిక రుగ్మతలపై పోరాటానికి ఏకంగా లివ్ లవ్ లాఫ్ అనే ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది దీపిక. ఫౌండేషన్ ద్వారా దీపిక అందిస్తున్న సేవల్ని గుర్తించిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు  క్రిస్టల్ అవార్డును ప్రదానం చేసింది. అవార్డును అందుకున్న దీపిక.. ఈ సందర్భంగా తన జీవితానుభవాల్ని సభికులతో పంచుకున్నారు. డిప్రెషన్ , ఆందోళనలు ఇతర జబ్బుల్లాంటివేనన్న దీపిక వాటిని మనమే నయం చేసుకోవచ్చన్నారు. మానసిక రుగ్మతపై నేను పెంచుకున్న ప్రేమ, ద్వేషమే నాకు జీవితం గురించి ఎంతో నేర్పిందన్నారు దీపిక.

డిప్రెషన్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే మీరు ఎప్పుడూ ఒంటరి కాదు. డిప్రెషన్‌ అనేది సాధారణమే కానీ తీవ్రమైన సమస్య. ఇతర రోగాల మాదిరిగానే ఇది కూడా ఒక జబ్బు మాత్రమే, దాన్ని నయం చేసుకోగలమని మనమంతా అర్థం చేసుకోవాలి. డిప్రెషన్ ను నేను కూడా అనుభవించాను. ఆ అనుభవమే ఇప్పుడు మానసిక రుగ్మతలపై పోరాటం చేసేలా ప్రోత్సహించింది. అలాంటి వారి కోసం Live Love Laugh ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసేలా చేసిందని దీపిక తెలిపారు. కెరీర్‌ తొలినాళ్లలో తాను డిప్రెషన్‌తో బాధపడ్డానని, అయితే ఇప్పుడు దాని నుంచి పూర్తిగా బయటపడ్డానని దీపిక చాలా సార్లు తెలిపారు. లివ్ లవ్ లాఫ్ సంస్థ ద్వారా స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.  అంతేగాక, ఉచిత సైకియాట్రిక్‌ చికిత్సలు కూడా అందిస్తున్నారు.  

 

More Related Stories