English   

పవన్ కల్యాణ్ పక్కా రాంగ్ టైమ్ ఎంట్రీ ఇచ్చాడా..

Pawan Kalyan
2020-01-22 10:11:34

ఓ వైపు అమరావతిలో రైతులు చచ్చిపోతున్నారు.. మరోవైపు రాజకీయంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో పాలిటిక్స్ ఇప్పుడు కుతకుతలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన మీతోపాటే ఉంటుందని పవన్ చెప్పాడు. కానీ అంతలోనే సినిమాల్లోకి వచ్చేసాడు. ఈయన నటిస్తున్న పింక్ రీమేక్ షూటింగ్ మొదలైంది. అంతేకాకుండా ఇప్పుడు మరో సినిమాను కూడా ప్రకటించారు దర్శక నిర్మాతలు. 

పింక్ రీమేక్ తో పాటు ఏఎం రత్నం నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు పవర్ స్టార్. జనవరి 27న ఈ చిత్రం మొదలు కానుందని తెలుస్తుంది. ఇందులో బందిపోటు టైగర్ నాగేశ్వరరావుగా కనిపించబోతున్నాడు పవర్ స్టార్. దీనికోసం క్రిష్ పకడ్బందీగా కథ సిద్ధం చేసాడు. ఇదిలా ఉంటే సినిమాల్లోకి పవన్ కల్యాణ్ రాంగ్ టైమ్ ఎంట్రీ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఇన్ని రోజులు తాను సినిమాలు చేయను కేవలం రాజకీయాలే అంటూ ఇక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు జనసేనాని కాస్తా పవర్ స్టార్ అయిపోయాడు. 

పింక్ రీమేక్ కోసం మళ్లీ కెమెరా ముందుకొచ్చేసాడు. తొలిరోజు షూటింగ్ కూడా చేసాడు. అంతలోనే మళ్లీ ఆంధ్రా వెళ్లిపోయాడు. అక్కడ అమరావతిలో రైతుల కోసం పోరాడుతానని చెప్పాడు. మళ్లీ ఢిల్లీ వెళ్తానంటున్నాడు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ డైలాగులు కూడా చెబుతున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో కూడా సెటైర్లు పేలుతున్నాయి. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పవన్.. 151 ఎమ్మెల్యేలు ఉన్న జగన్ పార్టీని ఎలా కూల్చేస్తాడబ్బా అంటూ పవన్ పై జోకులు వేసుకుంటున్నారు వైసీపీ నేతలు. 

ఇదిలా ఉంటే ఈ సమయంలో పవన్ సినిమాల్లోకి వచ్చుండకూడదంటూ నేరుగానే విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రం అట్టుడుకిపోతుంటే ఇప్పుడు మీకు సినిమాలు కావాల్సి వచ్చాయా అంటూ ఓ రేంజ్ లో పవన్ తో ఆడుకుంటున్నారు నెటిజన్లు. దీనికి పవన్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో తెలియదు మరి. కానీ కచ్చితంగా ఈ టైమ్ లో మాత్రం పవన్ వచ్చుండాల్సింది కాదని అభిమానులు కూడా చెబుతున్నారు. ఎలాగూ ఇన్నాళ్లూ ఆగాడు కదా మరికొన్ని రోజులు ఆగి పింక్ రీమేక్ షూటింగ్ మొదలుపెట్టి ఉంటే బాగుండేదని వాళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు. 

ఇన్నాళ్లు పడిన శ్రమ.. పోరాటం అంతా వృథా అయ్యేలా ఉందని బాధ పడుతున్నారు ఫ్యాన్స్. రైతుల కోసం పోరాడుతున్న పవన్.. ఇప్పుడు సినిమాలు అంటూ వచ్చేస్తే కచ్చితంగా అధికార పక్షం పవన్ కల్యాణ్ తీరును ఎండగట్టక మానదు. మరి ఈ విపత్కర పరిస్థితుల నుంచి పవన్ ఎలా బయటికి వస్తాడో చూడాలిక. 

More Related Stories