English   

రజనీ మీద కేసు..కొట్టేసిన హైకోర్టు

rajni
2020-01-24 19:08:41

ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 1971లో సేలంలో జరిగిన ర్యాలీలో సీతారాముల ప్రతిమల్ని నగ్నంగా తీసుకెళ్లారని, ఆ విగ్రహాలకు చెప్పులదండ కూడా వేశారని రజనీ ఆరోపించారు. అప్పటి సర్కారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిందని చెప్పారాయన. అప్పట్లో ప్రముఖ జర్నలిస్ట్ ఛో రామస్వామి కూడా దీన్ని వ్యతిరేకించినట్టు చెప్పారు రజనీకాంత్. ఛో రామస్వామి తుగ్లక్ పత్రిక గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో రజనీ ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ వ్యాఖ్యల్ని డీఎంకే ఖండించగా.. ద్రావిడార్ విడుదలై కళగం మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలైనట్టుగా రిసీట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. రజనీకాంత్ మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, సమాజంలో చీలికలు తెస్తున్నారని ఆరోపించింది. అయితే ద్రావిడార్ విడుదలై కళగం వేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు ఎందుకొచ్చారని ప్రశ్నించింది.

పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో అసలు ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాలని ద్రావిడార్ విడుదలై కళగం కోరింది. అంతకుముందు ద్రావిడార్ విడుదలై కళగం కార్యకర్తలు రజనీకాంత్ ఇంటి ముందు నల్లదుస్తులతో నిరసన తెలిపారు. పెరియార్ పై చేసిన వ్యాఖ్యలకు రజనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే జరిగిన విషయాన్నే తాను చెప్పానని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. తన దగ్గర అప్పటి ర్యాలీ క్లిప్పింగులు కూడా ఉన్నాయని తెలిపారు. ఓవైపు ఈ వివాదం నడుస్తుండగానే  పెరియార్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తమిళనాడులో ధ్వంసం చేశారు. చెంగల్పేట్ జిల్లా కలియపట్టాయి గ్రామంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.  పెరియార్ విగ్రహం కుడిచేయి, ముఖం దెబ్బతినడంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం తెలియగానే ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Related Stories