పాపకు జన్మనిచ్చిన స్నేహ.. ఏంజల్ అంటూ సంతోషం

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటి స్నేహ రెండోసారి తల్లయ్యారు. శుక్రవారం రోజున అనగా.. జనవరి 24న ఆమె పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త నటుడు ప్రసన్న సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. మా ఇంట్లోకి ఏంజెల్ వచ్చేసిందంటూ.. సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్నేహ, ప్రసన్న దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తమిళ నటుడు ప్రసన్నను 2012లో ప్రేమ వివాహమాడింది స్నేహ. ఆ తర్వాత ఈ జంటకు 2015లో బాబు పుట్టాడు. పేరు విహాన్. దాంతో కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది స్నేహ. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. పలు సినిమాల్లో నటించింది. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన పటాస్లోనూ ఆమె నటించారు. అలాగే తెలుగులో చివరగా రామ్ చరణ్.. నటించిన వినయ విదేయ రామలో చెర్రీకి వదిన నటించింది. అయితే స్నేహ మళ్లీ తల్లి కావడంతో.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. 2000లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన స్నేహ తెలుగు తెరకు తొలివలపు అనే సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత ప్రియమైన నీకు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు టాప్ హీరోయిన్ గా రాణించింది.