మళయాళ బాహుబలి...ఆసక్తిరేకెత్తిస్తోన్న మరక్కర్ టీజర్

‘బాహుబలి’ సినిమా చేసిన మార్కేట్ కి ఆ సినిమాకి వచ్చిన క్రేజ్ కి చాలా మందికి స్ఫూర్తి నిచ్చింది. ఈ కోవలోనే తెలుగులో ‘సైరా’ సినిమాని కూడా నిర్మించారు. ఇక ఇప్పుడు ‘సైరా’ తరహాలోనే బాహుబలి లాంటి సినిమా చేయాలనే లక్ష్యంతో చారిత్రక నేపథ్యంతో మలయాళ చిత్రం ‘మరక్కార్- అరబిక్కడలిండే సింహం’ తెరకెక్కుతోంది. ‘సైరా’ చిత్రం 17వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉండబోతుంటే మోహన్ లాల్ ‘మరక్కార్’ సినిమా 16వ శాతాబ్దం నేపథ్యంలో భారత్ లో తమ జెండా పాతేందుకు ప్రయత్నించిన పోర్చుగీస్ వాళ్లకు వ్యతిరేకంగా ఉండనుంది.
16వ శాతాబ్దంలో పోర్చుగీస్ సేనలను అడ్డుకున్న కాలికట్ నావల్ ఛీప్ కుంజాలి మరక్కార్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తోన్న ‘మరక్కార్’ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘మరక్కార్’ గా నటించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి టీజర్‌ను విడుదల చేసింది సినిమా యూనిట్. గరుడ పక్షి ఎగురుతూ కనిపించే సీన్ తో ప్రారంభమయ్యే ఈ టీజర్ ఆద్యంతం సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తోంది.
మలయాళంలో మోహన్ లాల్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అతిథి పాత్రల్లో మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్, ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, సుదీప్, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా మార్చి 26న రిలీజ్ చేయబోతున్నారు.
మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా బాహుబలికి పోటీ అని అక్కడి ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. బాహుబలి రేంజ్ లోనే ఈ సినిమాని కూడా ప్రపంచ వ్యాప్తంగా 5000 స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమా 2020 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.