English   

చిరు, కొరటాల సినిమాలో అన్ని విశేషాలున్నాయా...

Chiranjeevi Koratala Siva.jpg
2020-01-28 16:11:58

కొరటాల సినిమా అంటేనే రేంజ్ ఉంటుంది. సందేశాన్ని కమర్షియల్ గా చెప్పడంలో ఈయన దిట్ట. ఇప్పుడు ఇలాంటి దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. దాంతో అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఈ సినిమాపై ఇండస్ట్రీలోనే కాదు.. బయట కూడా భారీ అంచనాలున్నాయి. రాజమౌళి మాదిరే కొర‌టాల కూడా అపజయం ఎరుగని దర్శకుడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు కూడా బాగానే ఆడాయి. భ‌ర‌త్ అనే నేను కాస్త అటూ ఇటూ అయినా.. క‌లెక్ష‌న్లు మాత్రం 90 కోట్ల‌కు పైగానే వ‌చ్చాయి. దాంతో ఇది కూడా అబౌ యావ‌రేజ్ కిందే లెక్క‌. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేని ప్ర‌యాణం అన్న‌మాట‌. పైగా సందేశాత్మ‌క క‌థ‌ల‌ను బాగా చెప్తాడ‌నే పేరుంది. క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది.. మెసేజ్ లు ఇవ్వ‌డంలో బాగా ఆరితేరిపోయాడు కొర‌టాల శివ‌.. ఇక ఇప్పుడు సైరాతో చిరంజీవి కూడా జోరు మీదున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా జనవరి నుంచి మొదలు కానుంది. ఠాగూర్ త‌ర‌హాలోనే ఇది కూడా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. అయితే ఇందులో దేవాదాయ శాఖలో జరుగుతున్న అరాచకాల గురించి చెప్పబోతున్నాడు దర్శకుడు కొరటాల. దీనికోసం కథ కూడా చాలా పకడ్భందీగా పూర్తి చేసాడు. చిరంజీవి పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. అక్కడ జరుగుతున్న అక్రమాలను వెలికి తీసే పాత్ర ఇది అంటున్నాడు దర్శకుడు కొర‌టాల. చిరు ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందంటున్నాడు కొరటాల. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ పాత్ర కోసం చిరు బరువు కూడా తగ్గిపోయాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఉంటాడని ప్రచారం జరుగుతుంది. సమ్మర్ నుంచి షూటింగ్ లో చరణ్ పాల్గొంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 90 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి చూపిస్తానంటున్నాడు కొరటాల. షూటింగ్ అంతా కేరళ, హైదరాబాద్ లో ఉంటుందని.. ఎక్కడా ఫారెన్ వెళ్లేది కూడా లేదని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ చిత్రం కోసం విలేజ్ సెట్ తో పాటు ప్రత్యేకంగా గుడి సెట్ కూడా వేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అదే సినిమాకు ప్రాణం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని.. వాళ్లెవరో త్వరలోనే చెప్తామంటున్నారు మేకర్స్. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. అన్నీ కుదిర్తే ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

More Related Stories