English   

నారప్ప వెంకటేష్ సొంత ఊరి కధతోనా...మరి ఫ్యామిలీ...

Venkatesh Narappa.jpg
2020-01-28 17:34:41

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా సినిమా ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ ఫిలిం ‘అసురన్’కు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన వెంకటేష్ లుక్, ‘నారప్ప’ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల అనంతపురం జిల్లాలో ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే  ధనుష్ అసురన్ లుక్ కి నారప్ప లుక్ కి పెద్దగా తేడా లేదు. దాన్ని బట్టి అసురన్ నేటివిటీ చెడగొట్ట కుండానే తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారనేది సుస్పష్టం.

నిజానికి ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల తెరకేక్కిస్తున్నాడు అనగానే ప్రేక్షకులు కంగారు పడ్డారు. ఎందుకంటే శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ డ్రామాలకు, సైలెంట్ లవ్ స్టోరీలకి పెట్టింది పేరు. అయితే ఈ సినిమా మాతృకలో కొన్ని పోరాట సన్నివేశాలు ఉన్నాయి. ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం డైరెక్టర్ బాబీని రంగంలోకి దించుతున్నట్టు సమాచారం. ఆ విషయం అలా ఉంచితే ‘అసురన్’ కధ అగ్రవర్ణాల మీద దళితుల తిరుగుబాటు నేపథ్యంలో ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకే నారప్ప కోసం తెలుగులో కారంచేడు నరమేధ ఘటనను ఆధారంగా తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలోని కారంచేడులో 1985లో దళితులకు, కమ్మ కులస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అధికారికంగా ఆరుగురు దళితులను కిరాతంగా చంపేయగా అనధికారికంగా లెక్కే లేదు.

ఈదమనకాండతో రాష్ట్రవ్యాప్తంగా దళితులలో చైతన్యం వచ్చి భారీ ఉద్యమం చేపట్టారు. ఈ ఘటన ఆధారంగా ఇప్పుడు ‘నారప్ప’ స్క్రిప్టు ఉంటుందని సమాచారం. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే బయట వెంకటేష్ కమ్మ సామజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, సినిమాలో దళితుడుగా కనిపించనున్నాడు. అయితే వెంకటేష్ తండ్రి రామానాయుడుది అదే ఊరు కారంచేడు. ఇక ఈ కారంచేడు ఘటనకి కారణం అని చెప్పబడే దగ్గుబాటి చెంచురామయ్య, రామానాయుడులు దాయాదులే. అంటే ఒక రకంగా వెంకటేష్ తన ఊరి కధను అది కూడా తన కుటుంబానికి సంబంధం ఉన్న కధలో అది కూడా తమ కుటుంబం చేసిందని చెప్పబడుతున్న మారణకాండను అంశంగా తీసుకుని సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు.

మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలుగా తెరకేక్కిస్తునారు. కార్మికుల దినోత్సవ సందర్భంగా మే 1న ‘నారప్ప’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

More Related Stories