మిల్లీమీటర్ సందిస్తే.. కిలోమీటర్ దూరేస్తున్న ధనుష్..

అబ్బో.. ఈ అరవోళ్లు ఉన్నారు చూడండి.. మహా ముదుర్లండీ బాబూ..! మన హీరోలు తమిళనాడు వెళ్లి అక్కడ తమ సినిమాలు విడుదల చేయడం ఈ మధ్యే నేర్చుకున్నారు. సినిమాలు ఫ్లాపైతే.. నెక్ట్స్ టైమ్ కనీసం ట్రై కూడా చేయట్లేదు. కానీ తమిళ హీరోలు మాత్రం ఆ టైప్ కాదండీ బాబూ..! చూడండి.. మీరు చూడాలి.. మీరు చూస్తూనే ఉండాలి.. చూడకపోతే ఊరుకోం.. అంటూ మనల్ని హిప్నటైజ్ చేసి పారేస్తున్నారు. అలా పదేళ్లుగా దండయాత్ర చేసి చేసి.. నాలుగేళ్ల కింద రఘవరన్ బిటెక్ తో హిట్ సాధించాడు ధనుష్.
తమిళ్ లో స్టార్ ఇమేజ్ ఉన్నా.. తెలుగులో మాత్రం ధనుష్ కు పెద్దగా గుర్తింపు లేదు. అయితే రఘువరన్ బిటెక్ తర్వాత ధనుష్ సినిమాలపై మన ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. ఆ సినిమా హిట్టవ్వడంతో తమిళనాట ఎప్పుడో ధనుష్ నటించిన సినిమాలన్నింటినీ దుమ్ముదులిపి రిలీజ్ చేసారు అక్కడి దర్శక నిర్మాతలు. విఐపి 2 లాంటి సినిమాలు కూడా తెలుగులో పెద్దగా వర్కవట్ కాలేదు. అయినా కూడా ఇంకా తెలుగులో సినిమాలు విడుదల చేస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం లోకల్ బాయ్ సినిమాతో రానున్నాడు ధనుష్. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. పటాస్ పేరుతో మొన్న సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. మాస్ ఆడియన్స్ కు పర్లేదు అనిపించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్. మరి ఈ చిత్రంతో తెలుగులో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలిక.