English   

ఆ ముగ్గురు హీరోయిన్లకి ఉన్న దమ్ము మన తెలుగు హీరోలకు లేదా

Tollywood Stars
2020-01-31 17:01:06

ఓ ప్రొటెస్ట్‌ దగ్గరకి సినిమా స్టార్‌ వచ్చి సపోర్ట్‌ చేస్తే ఆ లెక్కే వేరు. కనీసం ఒక మాట లేదా ఒక ట్వీట్ అయినా సరే. కానీ, టాలీవుడ్‌ కి ఆ స్పృహ కరువయిందా? సపోర్ట్‌ గానో, ఆఖరికి వ్యతిరేకంగా అయినా,  అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించటం లేదు. ఈ సమాజంలో వాళ్లూ భాగమే అనే సంగతి మర్చిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 

చపాక్ సినిమా ముందు రోజు రాత్రి వెళ్లి జెఎన్ యూ ఘటనపై నిరసనన తెలిపిన దీపిక పదుకునేకంటే ముందే బాలీవుడ్ నటులు పలువురు పౌరసత్వ సవరణ చట్టంపై తమ వ్యతిరేక వైఖరిని ప్రకటించారు. ముంబైలో కార్టర్ రోడ్డులో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్, అనుభవ్ సిన్హా, తాప్సీ పొన్ను, దియా మీర్జా, రిచా ఛధ్ధా, గౌహార్ ఖాన్ వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. 

ఇక సల్మాన్‌ ఖాన్‌, జోయా అఖ్తర్‌, అనిల్ కపూర్, అలియా భట్‌ తో పాటు, సోనమ్ కపూర్, ఆదిత్యరాయ్ కపూర్, రాజ్‌ కుమార్‌ రావ్, ట్వింకిల్ ఖన్నా, రితేశ్ దేశ్‌ ముఖ్, అదిల్ హుస్సేన్, కృతిసనన్, స్వరాభాస్కర్, షబానా అజ్మీ, అపర్ణసేన్, మాధవన్, నేహా దూపియా, వరుణ్ గ్రోవర్, విక్రమాదిత్య  మొదలైన వారు కూడా ప్రజాపక్షమే ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేశారు. బాలీవుడ్ లో ఈ సమస్యపై స్పష్టంగా మాట్లాడిన వారు కొందరైనా ఉన్నారు. కానీ, దక్షిణాదికొస్తే స్టార్లు, సూపర్ స్టార్లు ఒక్కరంటే ఒక్కరు నోరు మెదిపిన పాపాన పోలేదు. 

తమిళ నటుడు సిద్ధార్ధ, మళయాళ దర్శకుడు జకారియా మహ్మద్ లాంటి ఒకరిద్దరు తప్ప పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలపై తమ అభిప్రాయాన్నో, నిరసననో వెలిబుచ్చే ధైర్యం చేసినవారు లేరు. ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి మరీ దారుణం. ప్రజల సమస్యపై ఒక్క మాట మాట్లాడదాం.. అనే స్పృహ, అవగాహన ఉన్న నటులు కరువయ్యారు. రెండు నెలల కాలం నుండి దేశమంతా అట్టుడుకుతున్న సమస్య గురించి తెలుగు సినిమా తారలకు ఎంత పరిజ్ఞానం ఉందో కూడా అనుమానమే. 

ఇన్ని ప్రొటెస్టులు ఎందుకు జరుగుతున్నాయో, ఈ దాడులకు మూలం ఏంటో, పరిష్కారాలేమిటో కనీస మాత్రంగా తెలియని వారే ఎక్కువే అనే సందేహాలు సాధారణ ప్రజానీకంలో కలుగుతున్నాయి. సమాజ అభిమానాన్ని కలెక్షన్లుగా మార్చుకుంటూ, కోట్లు వెనకేసుకునే తారలు, ఆ సమాజానికి వచ్చిన సమస్యపై ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వకపోవటం అత్యంత దురదృష్టకరం. ఓవరాల్ గా ఈ అంశంపై కొందరు బాలీవుడ్ స్టార్లు ఒకవైపు... దేశ వ్యాప్తంగా మిగిలిన సినీ ప్రముఖులంతా ఒకవైపనే పరిస్థితి ఏర్పడింది.   
 

More Related Stories