English   

చూసి చూడంగానే రివ్యూ

Choosi Choodangaane Review
2020-01-31 13:04:53

పెళ్లి చూపులు లాంటి సినిమాను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి తన కొడుకు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘చూసీ చూడంగానే’. శేష సింధు రావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..

కథ :

సిద్ధూ (శివ) తల్లిదండ్రుల కారణంగా చిన్నప్పటి నుండి చదువుతో పాటు అన్నీ ఇష్టం లేని పనులు చేస్తుంటాడు. దాంతో కోరుకున్న జీవితం అనుభవించలేకపోతాడు. అలా తనకు నచ్చని బిటెక్ లో చేరతాడు. అలా కాలేజీలో ఐశ్వర్య (మాళవికా సతీశన్)ని చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే ఆమె కూడా సిద్ధూని ఇష్టపడుతుంది. అలా నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత బిటెక్ లో విడిపోతారు. ఆ తర్వాత సిధ్దూ లైఫ్ లోకి శ్రుతి రావ్ (వర్ష బొల్లమ్మ) వస్తుంది. వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. కానీ చెప్పుకోరు.. అంతలో సిద్ధూకి శ్రుతి గురించి ఒక నిజం తెలుస్తోంది. ఆమె కాలేజీ నుంచే సిద్ధూని ప్రేమిస్తుందని తెలుసుకుంటాడు. మరి అప్పుడే ఆ విషయం ఎందుకు చెప్పలేదు.. దాచాల్సిన అవసరం ఏమొచ్చింది.. చివరికి ఏమైంది అనేది అసలు కథ..

కథనం:

ముక్కోణ ప్రేమకథలు తెలుగులో ఇప్పటి వరకు చాలానే వచ్చాయి. ఇప్పుడు కూడా మరోసారి చూసి చూడంగానే సినిమాను ఇలాంటి కథతోనే తెరకెక్కించిన శేష సింధు రావు. హీరో ఓ అమ్మాయిని ప్రేమించడం.. హీరోను మరో అమ్మాయి ప్రేమించడం.. ఆ తర్వాత అసలు నిజం తెలియడం.. అక్కడ్నుంచి డ్రామా.. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. దాన్నే ఈ తరం అభిరుచులకు తగ్గట్లుగా మార్చే ప్రయత్నం చేసింది దర్శకురాలు.

తల్లిదండ్రుల ఒత్తిడితో ఇంజనీరింగ్ లో చేరి… ఆ తర్వాత ప్రేమలో పడి.. మధ్యలోనే ఆపేసి ఫోటోగ్రాఫర్ గా మారతాడు హీరో. ఈ క్రమంలో పిల్లల అభీష్టాలను పెద్దలు అర్థం చేసుకోవాలని చూపించే ప్రయత్నం చేసింది దర్శకురాలు. మరోవైపు హీరోయిన్ కూడా తండ్రి కోరిక ప్రకారం ఫారెన్ లో చదువుకుని వచ్చి మ్యూజిక్ డైరక్టర్ గా మారుతుంది.

ఫస్టాఫ్ లో అంతా మరీ స్లోగా నడిపించినట్లు అనిపిస్తుంది.. దానికితోడు తెలిసిన కథ కావడంతో ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ నుంచి వేగం పుంజుకుంటుంది. కానీ అప్పటికే చాలా వరకు ల్యాగ్ అయింది సినిమా. సెకండాఫ్ అసలు కథ చెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా ఫన్నీ సన్నివేశాలు బాగా రాసుకుంది దర్శకురాలు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ చేస్తూనే మరోవైపు బరువైన సన్నివేశాలను రాసుకుంది సింధూ రావు. ఓవరాల్ గా చూసి చూడంగానే పడిపోయే లవ్ స్టోరీ అయితే కాదు..

నటీనటులు :

శివ కందుకూరి పర్లేదు.. స్క్రీన్ పై అక్కడక్కడా కాస్త బెరుకుగా కనిపించాడు. అయితే యాక్టింగ్ పరంగా మాత్రం కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాడు.. హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ తన నటనతో పాటు గ్లామర్ తోనూ బాగా ఆకట్టుకుంది. మరో హీరోయిన్ కూడా బాగానే ఉంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన నటనతో మెప్పించింది వర్ష. హీరోకి తల్లిగా నటించిన పవిత్ర లోకేష్ కూడా ఎమోషనల్ నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక విభాగం :

గోపీ సుందర్ సంగీతం పర్లేదు. ఆకట్టుకునే పాటలు అయితే అంతగా లేవు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. దర్శకురాలు రాసుకున్న కథలో కొత్తదనం లేదు. యూత్ కనెక్ట్ అయ్యే అంశాలు తక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు చూసిన కథ కావడంతో చూసి చూడంగానే ఈ చిత్రం పాతదే కదా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా అంతే. సాగతీత సన్నివేశాలతో సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే చాలా వరకు ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా వీక్. చివరగా చూడి చూడంగానే ఆకట్టుకోలేని యూత్ డ్రామా.

చివరగా:

చూసి చూడంగానే.. చూడలేని ప్రేమకథ..

రేటింగ్: 2/5.

More Related Stories