English   

రజినీకాంత్ గారు మీరే ఆదుకోవాలి.. బయ్యర్ల ఆందోళన..

darbar
2020-02-01 05:17:23

ఒకప్పుడు రజనీకాంత్ సినిమా వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకునే వాళ్ళు. ఆయన సినిమా కోసం ఎగపడేవాళ్ళు. సినిమా ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ రూపంలోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేది. కానీ అది ఒకప్పటి రజినీకాంత్ సినిమా. ఇప్పుడు రజినీకాంత్ సినిమాలకు అంత సినిమా లేదు. ఆయన కూడా అందరిలాంటి మామూలు హీరో అయిపోయాడు. కొన్నేళ్లుగా రజనీకాంత్ సినిమాలు అంచనాలు అడ్డుకోవడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా సూపర్ స్టార్ సినిమాలు కొన్న తర్వాత దారుణంగా నష్టపోతున్నారు. కొచ్చాడయాన్ సినిమా నుంచి మొదలైంది. లింగా సినిమా డిస్ట్రిబ్యూటర్లు అప్పట్లో రజనీకాంత్ ఇంటి ముందు ధర్నా చేశారు. తమను ఆదుకోకపోతే రోడ్డున పడతామంటూ ఆందోళనలు కూడా చేశారు. కబాలి సినిమా సేఫ్ అయినా కూడా కాలా సినిమాకు మళ్లీ భారీ నష్టాలు వచ్చాయి. గతేడాది విడుదలైన పేట సినిమా కూడా నిర్మాతలకు లాభాలు తీసుకువచ్చినా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలను మిగిల్చింది. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన దర్బార్ సినిమా సైతం డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తీసుకొచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగ్గ విధంగా రాలేదు. ఒకప్పుడు రజనీకాంత్ సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా చాలు బ్లాక్ బస్టర్ అయ్యేవి.

కబాలి సినిమా అలాగే 200 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పుడు రజనీకాంత్ ఇమేజ్ పీక్స్ లో ఉంది. కానీ ఇప్పుడు ఆయన మార్కెట్ దారుణంగా పడిపోయింది. అందుకే మురుగుదాస్ లాంటి దర్శకుడు తోడుగా ఉన్నా.. దర్బార్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా నిలబడలేకపోయింది. తమిళనాట దాదాపు 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన దర్బార్ ఇప్పటివరకు కేవలం 36 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దానికితోడు ధనుష్ నటించిన పటాస్ సినిమా కూడా సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చడంతో దర్బార్ సినిమా కలెక్షన్లపై దెబ్బ పడింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు పైగా నష్టపోయారు. తమను ఆదుకోవాలని రజినీకాంత్ ను చెన్నైలో ఆయన ఇంట్లోనే కలిశారు దర్బార్ బయ్యర్లు. వాళ్లతో పాటు నిర్మాత కూడా ఉండటం గమనార్హం. కచ్చితంగా వాళ్లను ఆదుకుంటానని.. నష్టపోయిన దానిలో కనీసం 50 శాతం డబ్బులు వెనక్కి తిరిగి ఇస్తానని రజనీకాంత్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా రజనీకాంత్ సినిమాలు ఇంత దారుణంగా నష్టపోవడం మాత్రం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. రజనీ ఇమేజ్ పడిపోతుందనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

More Related Stories