English   

బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్.. ఆ నవ్వెక్కడ సర్..

Brahmanandam
2020-02-01 11:16:01

టాలీవుడ్ లో బ్ర‌హ్మానందం అంటే ఓ బ్రాండ్. తెర‌పై ఆయ‌న కాదు.. అత‌డి బ‌ట్ట‌త‌ల కనిపించినా చాలు హీరోకి ప‌డ్డ‌న్ని విజిల్స్ ప‌డ‌తాయి. గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి బ్ర‌హ్మి ప్ర‌స్థానం ఎదురులేకుండా సాగుతుంది. స్టార్ హీరోల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని క్రేజ్ తో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాడు బ్ర‌హ్మానందం. కేవ‌లం ఆయ‌న అప్పియ‌రెన్స్ తోనే కొన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయంటే అతిశ‌యోక్తి కాదు. ఎక్కడో కాలేజ్ లెక్చరర్ కాస్తా ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి కమెడియన్ గా మారి.. ఇప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్ కావడం అంటే చిన్న విషయం కాదు. 

చిరంజీవి పట్టుకొచ్చిన ఈ టాలెంట్.. ఇప్పుడు తెలుగు పరిశ్రమ నవ్వుకే చిరంజీవిలా మారిపోయింది. తెలుగు సినిమా కళామతల్లి పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వులా ఉండిపోయాడు బ్రహ్మి. ఎన్నో వందల సినిమాల్లో తనదైన నటనతో మెప్పించాడు ఈయన. ఒక‌ప్పుడు బ్ర‌హ్మి ఉంటేనే సినిమా.. కానీ ఇప్పుడు బ్ర‌హ్మి లేకుండానే హాయిగా ఉందంటున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. కానీ ఇప్పుడిప్పుడే ఈయ‌న‌కు క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్లు క‌నిపిస్తుంది. సాధార‌ణంగా ఆన్ సెట్స్ లో ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల్ని ఇబ్బంది పెడ‌తాడ‌నే రూమర్ బ్ర‌హ్మిపై ఉంది. పెద్ద సినిమాల‌కేమో గానీ త‌న బొమ్మేసుకుని న‌డిపించుకునే చిన్న సినిమాల విషయంలో బ్ర‌హ్మి ఆడిందే ఆట.. పాడిందే పాట అంటుంటారు ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు. 

ఈ మ‌ధ్య కాలంలో బ్ర‌హ్మానందం పాత్ర‌లేవీ పెద్ద‌గా క్లిక్ కాలేదు. గత మూడు నాలుగేళ్లలో కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకునే సినిమాలు చేసాడు బ్రహ్మి. చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150లోనూ బ్ర‌హ్మి పాత్ర పెద్ద‌గా కిక్ ఇవ్వ‌లేక‌పోయింది. దానికితోడు అవ‌కాశాలు కూడా రావ‌ట్లేదు. ఆ తర్వాత కూడా చేసిన కొన్ని సినిమాలు పెద్దగా నవ్వించలేదు. ఈ మధ్య అల వైకుంఠపురములో సినిమాలో కేవలం ఓ పాటలో కొన్ని సెకన్ల పాటు కనిపించాడు బ్రహ్మానందం. ఈ మ‌ధ్య కాలంలో బ్ర‌హ్మానందంకు చెప్పుకోద‌గ్గ పాత్ర‌లు కూడా రాలేదు. రేసుగుర్రం త‌ర్వాత ఆ స్థాయిలో న‌వ్వించిన పాత్ర లేదు. లౌక్యంలో ఉన్నంతలో కాస్త బెట‌ర్. దాంతో పూర్తిగా ఖాళీ అయిపోయారు బ్ర‌హ్మానందం. అంత‌గా దిగ‌జారిపోయింది ఆయ‌న ఇమేజ్. 

ఒక్కొక్క‌రుగా సీనియ‌ర్ క‌మెడియ‌న్లు క‌న్నుమూయ‌డం.. కొత్త వాళ్ళ రాక బ్ర‌హ్మికి ఇబ్బందిగా మారింది. చివరికి ఇప్పుడిక చేసేదేమీ లేక‌.. త‌న‌కంటూ జూనియ‌ర్ క‌మెడియ‌న్ల‌కు ఫోన్ చేసి వాళ్ల సినిమాల వివ‌రాలు తెలుసుకుంటున్నాడ‌ని స‌మాచారం. వాళ్ల కాంబినేష‌న్లు, సినిమా ముచ్చ‌ట్ల‌తో కాల‌క్షేపం చేస్తున్నాడ‌ట బ్ర‌హ్మానందం. ప్ర‌స్తుతం బ్ర‌హ్మి చేతిలో చెప్పుకోద‌గ్గ సినిమాలైతే లేవు. కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు బ్రహ్మానందం. ఏదేమైనా కూడా ఎంత ఖాళీగా ఉన్నా కూడా ఆయన తెలుగు సినిమా గతిని మార్చేసిన కమెడియన్.. కామెడీ కింగ్. ఆయనకు మరోసారి హ్యాపీ బర్త్ డే.

More Related Stories