English   

సుడిగాలి సుధీర్ హీరోగా సక్సెస్ అవుతాడా..

sudi
2020-02-05 20:38:06

జబర్దస్త్ కమెడియన్లు హీరోలుగా మారడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. బుల్లితెరపై బ్లాక్ బస్టర్ కామెడీ చేసిన వీళ్లంతా వెండితెరపైకి వచ్చేసరికి మాత్రం చేతులెత్తేస్తున్నారు. అక్కడ క్రేజ్ ఉందని హీరోగా నటించి బొక్క బోర్లా పడుతున్నారు. ఇప్పటికే చమ్మక్ చంద్ర, షకలక శంకర్, ధనా ధన్ ధన్ రాజ్ లాంటి వాళ్ళు హీరోలుగా చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నారు. అదే కోవలో సుడిగాలి సుధీర్ కూడా ఈ మధ్య సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా చేసి దారుణంగా పరాజయం పాలయ్యాడు. ఈ సినిమా వచ్చిన రెండు నెలల గ్యాప్ లోనే మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సుడిగాలి సుధీర్. ఈసారి ఒక్కడు కాకుండా తన గుంపును తీసుకొస్తున్నాడు. జబర్దస్త్ కామెడీ షో లో సుధీర్ తో పాటు ఉండే గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సన్నీ తోడుగా త్రీ మంకీస్ సినిమా చేశాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమా కోసం రష్మి గౌతమ్, శేఖర్ మాస్టర్, రోజా లాంటి వాళ్ళు బయటికి వచ్చి బాగా ప్రమోషన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న సమంత అక్కినేని జాను సినిమాకు పోటీగా త్రీ మంకీస్ విడుదలవుతుంది. కచ్చితంగా ఈ సినిమాతో వెండితెరపై కూడా మ్యాజిక్ చేస్తామని ఈ జబర్దస్త్ కమెడియన్లు ధీమాగా చెబుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే మరోసారి పూర్తి స్థాయి కామెడీ సినిమాతో వస్తున్నారని అర్థమైపోయింది. మరి ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ అండ్ బ్యాచ్ వెండితెరపై కూడా మ్యాజిక్ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పెద్దగా సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకు థియేటర్లు కూడా బాగానే దొరుకుతున్నాయి.

More Related Stories