English   

విజయ్‌ సినిమా షూటింగ్‌ లో రచ్చ..లాఠీఛార్జ్

vijay
2020-02-08 07:24:02

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నివాసంలో జరిగిన ఐటీ సోదాలు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. విజయ్ షూటింగ్ స్పాట్ కు వెళ్లి మరీ అధికారులు ఆయన్ను గంటల తరబడి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మెర్సెల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా విజయ్ డైలాగ్స్ చెప్పినప్పట్నుంచే కేంద్రం ఆయన్ను టార్గెట్ చేసిందనే ప్రచారం సాగుతోంది. మూడేళ్ల క్రితం వచ్చిన మెర్సెల్ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడే పురుడు పోసుకున్న జీఎస్టీకి వ్యతిరేకంగా ఆ సినిమాలో డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. గోరఖ్ పూర్ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై కూడా విజయ్ డైలాగ్స్ చెప్పారు.
 
మెర్సెల్ లో త్రిపాత్రాభినయం చేసిన విజయ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా డైలాగ్స్ చెప్పారని బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. అప్పట్లో మెర్సెల్ రిలీజ్ కానివ్వమని కాషాయ శ్రేణులు సవాళ్లు చేశారు. అయితే వివాదాస్పద డైలాగులు తొలగిస్తామని నిర్మాత చెప్పడంతో అప్పట్లో గొడవ సద్దుమణిగింది. తర్వాత మెర్సెల్ మూవీ సూపర్ హిట్టైంది. ఇప్పుడు విజయ్ నివాసం, ఆస్తులపై జరుగుతున్న ఐటీ దాడులు మెర్సెల్ నాటి కక్షతోనే జరుగుతున్నాయని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అప్పట్నుంచీ కేంద్రం కక్ష కట్టిందని, అదను చూసి ఇప్పుడు ఐటీ దాడుల పేరుతో వేధిస్తోందని ఆరోపిస్తున్నాయి.

మరోవైపు విజయ్ నివాసంలో 65 కోట్లకు పైగా నగదు దొరికిందని, దీనికి లెక్కల్లేవని ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన డబ్బు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్న వాదన కూడా ఉంది. అటు ఐటీ దాడుల తర్వాత విజయ్ నైవేలీ లిగ్నెైట్ కార్పొరేషన్ దగ్గర షూటింగ్ లో పాల్గొనగా బీజేపీ  శ్రేణులు వచ్చి అడ్డుకోవడం మరింత దుమారం రేపుతోంది. అయితే గనులు దగ్గర షూటింగ్ కు ఎలా పర్మిషన్ ఇస్తారని నిలదీశారు బీజేపీ కార్యకర్తలు. ఇప్పటిదాకా బీజేపీ ఐటీ దాడుల వెనుక ఉందేమోనని అనుమానించిన విజయ్ ఫ్యాన్స్ కు ఈ ఘటన తర్వాత ఆ విషయం నిర్థారణ అయింది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. విజయ్ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది. విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ బీజేపీ గొడవ ఇంతటితో ఆగుతుందా.. ఇంకా ముదురుతుందా అనేది చూడాల్సి ఉంది.

 

More Related Stories