English   

రాజమౌళి నిర్ణయం.. వంశీ పైడిపల్లికి అనుకోని వరం..

 Vamshi Paidipally
2020-02-08 17:48:32

రాజమౌళి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది దర్శక నిర్మాతలకు అనుకోని అడ్డంకిగా మారిపోయింది. కొందరు హీరోలు అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయారు. తాను తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తున్నాం అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ లోకి వెళ్ళిపోయారు. జులై 30 నుంచి జనవరి 8 ఈ సినిమా వాయిదా పడింది. అప్పటి వరకు సంక్రాంతికి రావాలనుకున్న చాలా మంది హీరోలు ఆలోచనలో పడిపోయారు. 

చూస్తూ చూస్తూ రాజమౌళి సినిమాకు ఎదురు వెళ్లే ధైర్యం మాత్రం ఎవరూ చేయరు. అందుకే 2021 సంక్రాంతి ఖచ్చితంగా రాజమౌళి ఒక్కడే వస్తాడని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం దర్శకుడు వంశీ పైడిపల్లికి వరంగా మారింది. ఈయన ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి కథ సిద్ధం చేస్తున్నాడు. మే నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మహర్షి సినిమా తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. దాంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 

ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయం అందుకున్నాడు మహేష్ బాబు. దాంతో మళ్ళీ వచ్చే సంక్రాంతికి వంశీ పైడిపల్లి సినిమాను తీసుకురావాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఇదే ప్రణాళిక వంశీ పైడిపల్లికి కూడా చెప్పాడు మహేష్. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆయనకు డెడ్ లైన్ కూడా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇలాంటి సమయంలో రాజమౌళి అడ్డు రావడంతో ప్లానింగ్ అంతా ఒక్కసారిగా చెదిరిపోయింది. దాంతో వంశీ పైడిపల్లికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది. 

సంక్రాంతి సీజన్ అయిపోతే నెక్స్ట్ సమ్మర్ సీజన్ తప్ప మరొక ఆప్షన్ లేదు. అంటే మరో మూడు నెలలు ఎక్స్ ట్రా టైం దొరికింది అన్నమాట. ఆ లోపు సినిమాను హాయిగా పూర్తి చేసుకోవచ్చు అనేది వంశీ పైడిపల్లి ప్లాన్. మొత్తానికి మహేష్ సినిమాలో మరీ ఆరు నెలల్లో కాకుండా ప్రశాంతంగా తొమ్మిది నెలల పాటు టెన్షన్ లేకుండా తెరకెక్కించే అవకాశం వంశీ పైడిపల్లికి రాజమౌళి ఇచ్చాడన్నమాట. 

More Related Stories