English   

అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు.. పవన్ సూపర్ బ్యాలెన్సింగ్..

pk
2020-02-11 15:35:57

రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయడం అంటే చిన్న విషయం కాదు. కచ్చితంగా దీనికోసం విమర్శలు కూడా ఎదుర్కొనే సమర్థత ఉండాలి. అది తనకు బోలెడు ఉంది అంటున్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి.. మరో కన్ను సినిమాలపై ఉంచాడు పవర్ స్టార్. అక్కడ ఏమి అవసరం వచ్చినా కూడా సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెంటనే ప్రజల మధ్య ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒకేసారి మూడు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చినా కూడా అక్కడ ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం అస్సలు మర్చిపోను అంటున్నాడు పవర్ స్టార్. ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈయన. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న పవన్ కళ్యాణ్ ఐదు రోజుల పాటు సినిమా షూటింగ్‌కు గ్యాప్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రాజకీయ భేటీలో భాగంగా కర్నూలు వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు పవన్. అక్కడే రెండు రోజులు ఉండి స్థానిక నేతలతో సమావేశమై పార్టీ వ్యవహారాలపై చర్చిస్తారని అంటున్నారు.

మొన్నటి వరకు రాజకీయాలు చేసినా.. పార్టీని నడపాలంటే కచ్చితంగా డబ్బులు కావాల్సిందే. అందుకే సినిమాలు చేయడం తప్ప తన దగ్గర మరో మార్గం లేదని తమ పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ అర్థమయ్యేలా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయాల్లో చేసేది కూడా ఏమీ లేకపోవడంతో మరో మూడేళ్ల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే రాబోయే మూడు సంవత్సరాలు వీలైనంత త్వరగా ఎన్ని సినిమాలు కుదిరితే అన్ని పూర్తిచేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు పవన్. పూర్తిగా సినిమాల్లో పడి రాజకీయాలను పక్కన పెడితే ప్రజలతో పాటు అభిమానుల్లోనూ నమ్మకం కోల్పోతామన్న ఉద్దేశంతో పాటు లేనిపోని అపప్రథను మూటగట్టుకోవలసి వస్తుందని పవన్‌ భావిస్తున్నాడు. అందుకే ఈ సమయంలో కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల గురించి కూడా కాస్త సమయం కేటాయించాలని పార్టీ వర్గాలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంత బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా రాజకీయాల కోసం సమయం కేటాయిస్తున్నాడు పవన్. కర్నూలులో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ముగిసిన తర్వాత నేరుగా హైదరాబాద్ చేరుకుని మళ్లీ షూటింగ్‌ లో జాయిన్ కావాలని చూస్తున్నాడు పవన్. ఈ ప్రయాణాలన్నింటికీ ప్రత్యేక విమానాన్ని వినియోగించడం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది దానికి సంబంధించిన ఖర్చులు నిర్మాతలే భావిస్తారని కొందరు చెబుతుంటే.. కాదు పవన్ సొంత ఖర్చులతో ఈ విమానాన్ని తెచ్చుకుంటున్నాడని మరికొందరు చెబుతున్నారు. అయితే షూటింగ్ ల నుంచి బయల్దేరితే మాత్రం మొత్తం ఖర్చుని నిర్మాత దిల్ రాజు భరిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్సింగ్‌ చేసుకుంటూ పవన్‌ ముందుకెళ్లడంపై సెటైర్లు కూడా బాగానే పేలుతున్నాయి. రాజకీయాలను పవన్‌ టైం పాస్ కోసం  చేస్తున్నాడని.. పవర్ ని ఎప్పటికీ పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్ గా మిగిలిపోతాడు అంటూ ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. వరుసగా సినిమాల్లో నటించాలని ముందుగానే ఫిక్సవ్వడం వల్లే ఆయన బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని చెబుతున్నారు. బీజేపీతో కలిసి వెళ్లడం జనసేనకు లాభిస్తుందని.. కమల దళంతో కలిస్తే తన క్యాడర్ కూడా బలపడుతుందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏదేమైనా కూడా అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు పవన్ కళ్యాణ్.

More Related Stories