సినిమా మీద ద్రుష్టి పెట్టిన తెలంగాణా

సినీ పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు తీసుకోవాల్సిన చర్యలపై టాలీవుడ్ పెద్దలతో సంప్రదింపులు చేస్తోంది. వారి నుంచి సూచనలు, సలహాలు, ప్రతిపాదనలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా.. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని మరోసారి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న అతి ముఖ్యమైన పైరసీ సమస్య నివారణ సహా సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు ఇప్పించేలా చర్యలు తీసుకోనున్నట్టు చెబుతున్నారు.
నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జునలతో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మరోమారు భేటీ అయ్యారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం అక్కడే హోం, రెవెన్యూ, న్యాయ, కార్మికశాఖ అధికారులతో తలసాని సమీక్ష నిర్వహించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాల్లో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. సినీ, టీవీ కళాకారులకు ఇళ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని దిశానిర్దేశం చేశారు. చిత్రపురి కాలనీలోనే ఈ స్థలం ఉండబోతోంది.
కల్చరల్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాల సేకరణ జరపాలని సూచించారు తలసాని. పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి తలసాని స్పష్టంచేశారు. వారం రోజుల క్రితం ఇదే విషయంపై చిరంజీవి ఇంట్లో కలిసారు తలసాని. చిత్రపురి కాలనీలో హాస్పిటల్, పాఠశాల నిర్మాణంతో పాటు సినీ కార్మికుల ఇళ్ల నిర్మాణానికి స్థలం కేటాయింపుపై చిరు, నాగ్ లతో మంత్రి చర్చించారు. తాజాగా మరోసారి నాగార్జున అన్నపూర్ణా స్టూడియోలో సమావేశమై చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.