English   

రాక్షసుడితో రక్షకుడు.. అదిరిపోయిన వి కొత్త లుక్..

Nani Sudheer Babu
2020-02-11 16:24:10

రక్షకుడు.. రాక్షసుడు కలిసొచ్చారు. టాలీవుడ్ లో ట్రెండ్ మెల్లగా మారుతుంది. ఒకప్పటిలా హీరోలు విలన్లు లేరీ నాటకంలో.. కథ నచ్చితే విలన్ కూడా అయిపోతున్నారు. పైగా మన హీరోలకు ఇప్పుడు విలన్ గా నటించడం అలవాటైపోయింది. దాన్ని ట్రెండ్ గా మార్చేస్తున్నారు కూడా. దానికి తోడు దర్శకులు కూడా హీరోలకు సరిపోయే కథలు తీసుకొస్తున్నారు. వాళ్లు చెప్పే కథలు నచ్చితే ప్రతినాయక పాత్రలు చేయడానికి కూడా మన హీరోలు వెనకాడటం లేదు. ఇప్పుడు నాని కూడా ఇదే చేస్తున్నాడు. 

తాజాగా ఈయన నటిస్తున్న వి సినిమా నుంచి మరో లుక్ విడుదలైంది. ఇందులో రాక్షసుడితో రక్షకుడు వచ్చేసాడు. అంటే నాని, సుధీర్ బాబు ఇద్దరూ ఉన్న ఫోటోను విడుదల చేసాడు దర్శకుడు ఇంద్రగంటి. గతేడాది జెర్సీతో హిట్ కొట్టి.. గ్యాంగ్ లీడర్ తో ఫ్లాప్ ఇచ్చాడు నాని. ప్రస్తుతం తన 25వ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణతో వి అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన నేను లోకల్, ఎంసిఏ సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఇప్పుడు మూడోసారి దిల్ రాజుతో సినిమా చేయబోతున్నాడు నాని. దానికి తోడు అది 25వ సినిమా కావడంతో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఇందులో నాని ప్రతినాయక పాత్రలో నటించబోతున్నాడు. ఇంద్ర‌గంటి మోహన కృష్ణ ఈ క్యారెక్టర్ ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాడని.. నాని కూడా తన కెరీర్ కు ప్రాణం పోసిన ఇంద్రగంటి మోహనకృష్ణ తోనే 25వ సినిమా చేయడంతో ఆనందంగా ఒప్పుకున్నాడు. ఇందులో పూర్తిస్థాయి నెగిటివ్ రోల్ చేస్తున్నాడు నాని. ఇప్పటికే ఓ పాట, ఫైట్ బ్యాలెన్స్ తప్ప షూటింగ్ అంతా అయిపోయింది.  ఇంద్రగంటిపై నమ్మకంతో ఇంకో మాట మాట్లాడకుండా విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు నాని. ఇందులో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఉగాది కానుకగా మార్చ్ 25, 2020న విడుదల కానుంది ఈ చిత్రం. ఫిబ్రవరి 17న టీజర్ విడుదల కానుంది. జెంటిల్ మెన్ సినిమాలో కాసేపు ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించినా.. చివరికది హీరోగానే ముగిసింది. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయి విలన్ గా నాని నటిస్తున్నాడు. మరి ఎలా ఉండబోతుందో చూడాలి.

More Related Stories